Joshimath: దేవభూమిలో ప్రకంపనలు… జోషిమఠ్‌లో కుంగుతున్న భూమి
Joshimath: హిమాలయ పర్వత సానువుల్లో ప్రశాంతమైన వాతావరణంలో ఒక్కసారిగా అలజడి ప్రారంభమైంది. ఉన్నట్టుండి దేవభూమిలో ప్రకంపనలు మొదలయ్యాయి. దేవభూమి ప్రాంతంలోని జోషిమఠ్ లోని భూమి కుంగిపోవడం మొదలైంది. దీంతో అక్కడి ఇళ్లు, రోడ్లు బీటలువారాయి. పరిస్థితులు నానాటికి తీవ్రం అవుతుండటంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. జోషిమఠ్‌లో నివశిస్తున్న 800 కుటుంబాలను అక్కడి నుండి తరలించాలని నిర్ణయించింది. దీనికోసం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హెలికాఫ్టర్లను సిద్ధం చేసి జోషిమఠ్‌కు పంపారు. ఇక, కేంద్ర ప్రభుత్వం కూడా భూమి కుంగిపోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తల బృందాన్ని అక్కడికి పంపింది.
ఈరోజు శాస్త్రవేత్తల బృందం నివేదికను సమర్పించే అవకాశం ఉన్నది. సముద్రమట్టానికి ఆరువేల అడుగుల ఎత్తులో జోషిమఠ్ ఉన్నది. ఇక్కడ సుమారు మూడువేల కుటుంబాలు నివశిస్తున్నాయి. 800 ఇళ్లకు పగుళ్లు రావడంతో అక్కడే ఉంటే మరింత ప్రమాదమని భావించిన ప్రభుత్వం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రోడ్లు సైతం పగుళ్లు ఏర్పడ్డాయి. జోషిమఠ్ కుటుంబాలను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ. 100 కోట్లు విడుదల చేశారు. బాధిత కుటుంబాలను పికెల్‌కోటి, గౌచర్ ప్రాంతాలకు తరలిస్తున్నారు.