Udhayanidhi Stalin To Meet PM Modi: ప్రధానితో ఉదయనిధి స్టాలిన్ భేటి
Udhayanidhi Stalin meets PM Modi today: డిఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈరోజు ఢిల్లీలో ప్రధాని మోడీని కలవనున్నారు. ఉదయనిధి స్టాలిన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇటీవలే ప్రధాని మోడీ చెన్నై వచ్చిన తరుణంలో డీఎంకే నేతలు ఆయన్ను కలిశారు. ఈ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్‌ను ఢిల్లీ రావాలని ప్రధాని ఆహ్వానించారు.
ఈ మేరకు ఉదయనిధి స్టాలిన్ ప్రధానిని కలుసుకునేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్లు డీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. డీఎంకే పార్టీకి బీజేపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. బీజేపీని పూర్తిగా వ్యతిరేకించే పార్టీల్లో డీఎంకే కూడా ఒకటి. రాష్ట్రంలో కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకున్న డీఎంకే, సడెన్‌గా పీఎం నరేంద్ర మోడీని కలిసేందుకు ఉదయనిధికి అవకాశం కల్పిస్తున్నారంటే, కేంద్రానికి దగ్గరయ్యేందుకు స్టాలిన్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధానితో ఉదయనిధి స్టాలిన్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ భేటీలో ఏయే అంశాలపై చర్చలు జరుగుతాయో చూడాలి.