Toll Charges Hike: పెరగనున్న టోల్ చార్జీలు… ఏప్రిల్ 1 నుండి బాదుడు షురూ
Toll Charges hike from April 1st: మార్చి 1వ తేదీన గ్యాస్ ధరలను రూ. 50 పెంచి సామాన్యుడిపై భారం వేసిన కేంద్రం తాజాగా మరో బాదుడుకి సిద్దమైంది. ఈసారి జాతీయ రహదారులపై ప్రయాణించే వారిపై భారం వేయనున్నది. టోల్ చార్జీలను పెంచేందుకు జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ సిద్దమైంది. జాతీయ రహదారుల ఫీజ్ నిబంధనలు 2008ని అనుసరించి ప్రతి ఏడాది అప్పటి అవసరాలకు తగినట్లుగా చార్జీలను పెంచుతుంటారు. కాగా ఈసారి టోల్ చార్జీలు 5 నుండి 10 శాతం మేర పెరగనున్నాయి.
పెంచిన చార్జీలను ఏప్రిల్ 1 వ తేదీ నుండి అమలులోకి తీసుకురావాలని ఎన్‌హెచ్ఏఐ నిర్ణయించింది. ఈ ఏడాది పెంచుతున్న ధరలను అమలులోకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టోల్ సంస్థల అధికారులకు ఎన్‌హెచ్ఏఐ ఆదేశాలు జారీ చేసింది. కార్లు, లైట్ వెయిట్ వెహికల్స్ పై 5 శాతం, హెవీ వెహికల్స్‌కు అదనంగా 10శాతం మేర టోల్ చార్జీలు వసూలు చేయనున్నారు. గతంలో టోల్ గేట్లకు 10 కిమీ పరిధిలో నివశించే స్థానికులకు టోల్ పాస్‌లు ఇచ్చేవారు. వారి నుండి కొంత మొత్తంలో ఫీజులు వసూలు చేసేవారు. కాగా, ఇప్పుడు ఆ పరిధిని పెంచి 20 కిమీకు పెంచారు. దీంతోపాటు నెలవారీ చార్జీలు కూడా 10 శాతంమేర పెంచనున్నారు.