Republic Day Celebrations: గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులు వీరే
74th Republic Day Celebrations in Delhi: ఢిల్లీలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం 10:30 గంటల నుండి పరేడ్ ప్రారంభం కానున్నది. ఈ పరేడ్ కోసం భారీ భద్రత ఏర్పాట్లను చేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, ఇతర కేంద్ర మంత్రులు, ముఖ్య జాతీయ నాయకులు ఈ పరేడ్‌ను తిలకించేందుకు హాజరుకానున్నారు. ఈ ఏడాది ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్ధుల్ ఫత్ఫ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అంతేకాకుండా ఈ 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథుగా కేంద్ర ప్రభుత్వం కొందరిని ఆహ్వానించింది.
వారిలో సామాన్య చిరు వ్యాపారులు, సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, కర్తవ్యపథ్ ఆధునికరణ పనుల్లో పాల్గొన్న కార్మికులు, నగరంలో కూరగాయల విక్రయదారులు, పాలబూత్ వ్యాపారులు, కిరాణా దుకాణదారులు, రిక్షా కార్మికులకు కేంద్రం ఆహ్వానం పంపింది. వీరంతా ఈరోజు జరుగుతున్న 74వ రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటున్నారు. వీరికోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేసింది. పరేడ్ ముఖ్య అతిధి ప్రధాన వేదికకు ఎదురుగా ప్రత్యేక అతిధులకు వేదికను కేటాయించారు. తమను ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందని కూరగాయల వ్యాపారులు, రిక్షా కార్మికులు పేర్కొన్నారు. ఇలా తమను అక్కడ చూసుకుంటామని కలలో కూడా ఊహించలేదని కార్మికులు పేర్కొన్నారు.