ద కేరళ స్టోరీ’ సినిమా విడుదల ముందు నుంచే వివాదాన్ని రగిలించిన విషయం తెలిసిందే. ఈ వివాదాలే మధ్యే ఎట్టకేలకు సినిమా విడుదలైంది.
The Kerala Story: ‘ద కేరళ స్టోరీ’ సినిమా విడుదల ముందు నుంచే వివాదాన్ని రగిలించిన విషయం తెలిసిందే. ఈ వివాదాల మధ్యే ఎట్టకేలకు ఈ నెల ఐదవ తేదీన సినిమా విడుదలైంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ చిత్రాన్ని ప్రదర్శించడం లేదు. ఈ క్రమంలో ఈ మూవీ విడుదలపై కేరళ హైకోర్టు స్టే నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇవాళ సుప్రీం కోర్టు విచారించనుంది. వివాదస్పద సినిమా ‘ది కేరళ స్టోరీ’ని ఎందుకు బ్యాన్ చేశారని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాగే తమిళనాడులో ఈ సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేయకపోవడాన్ని నిలదీసింది. వివరణ ఇవ్వాలంటూ ఈ రెండు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ చిత్రం మే 5న దేశవ్యాప్తంగా విడుదలైంది. అయితే మూడో తేదీనే విడుదలను నిలిపేయాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనికి సినిమా కళాత్మక విలువతో సంబంధం లేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ కూడిన బెంచ్ అభిప్రాయపడింది. అయితే కేరళ హైకోర్టులోనే ఈ అంశాన్ని తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. సినిమా టీజర్‌ను వీక్షించిన హైకోర్టు న్యాయమూర్తులు విడుదలపై స్టేకు నిరాకరించారు. కేరళ నుంచి 32 వేల మంది యువతులను తీవ్రవాద సంస్థ ఐసిస్‌లోకి చేరేలా వారి ముస్లిం స్నేహితులు ప్రలోభపెట్టారని సినిమాలో పేర్కొనడాన్ని పిటిషన్లో ఖుర్బాన్ అలీ ఆక్షేపించారు.ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టు మెట్లెక్కారు. అలీ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ కేసులో వాదనలు వినిపించనున్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ది కేరళ స్టోరీ మూవీపై ఈ మద్యే నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి వివాదాల్లో ఉంది. కేరళకు చెందిన 32,000 మంది బాలికలు అదృశ్యమయ్యారని, ఆ తర్వాత ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్లో చేరారని ట్రైలర్‌పై విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో నేడు సుప్రీం లో వాదనలు జరుగనున్నాయి.