Maharashtra Politics: మరింత ముదురుతున్న మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం
Uddhav Thackeray Comments: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింతగా ముదురుతోంది. పార్టీని మోసం చేసి సీఎం కుర్చీ ఎక్కుదామని తిరుగుబాటు చేసిన ఏక్ నాథ్ షిండేపై, డబ్బులకు ఆశపడి షిండే వెనుక చేరిన ఎమ్మెల్యేలపై శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో ఠాక్రే ఇవాళ వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. రెబల్ ఎమ్మెల్యేలు పార్టీని విచ్చిన్నం చేయాలని చూస్తున్నారన్నారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించినా షిండే వినలేదని గుర్తు చేశారు. శివసేన పార్టీని, ఠాక్రే పేరును పలకకుండా వారు ఉండగలరా అని ప్రశ్నించారు.
ఏక్ నాథ్ షిండే, ఆయనకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేల తిరుగుబాటుకు కారణం తన కుమారుడే అంటున్నారన్నారు. తన కుమారుడిపై వారికి అక్కసు ఎందుకు అని ప్రశ్నించారు. అదిత్య ఠాక్రే మరో అధికార కేంద్రంగా మారబోతున్నాడనే తప్పుడు ప్రచారం చేశారని ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. ఏక్ నాథ్ షిండే కుమారుడు ఎంపీగా ఉన్నారన్న ఆయన.. అలాంటప్పుడు నా కుమారుడి విషయంలో వారికి ఉన్న సమస్య ఏమిటో అర్థం కావడం లేదని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.