గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి. దీంతో యూఏవీలు, హెలికాప్టర్లను రంగంలోకి దించారు. సైన్యం, అసోం రైఫిల్స్ ఇతర పారా మిలిటరీ బలగాలు కల్లోలిత జిల్లాల్లో 24 గంటలు పహారా కాస్తున్నాయి. ఇండో-మయన్మార్ సరిహద్దులో దాగిన తిరుగుబాటు గ్రూపులు శాంతికి విఘాతం కలిగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Manipur: గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి. దీంతో యూఏవీలు, హెలికాప్టర్లను రంగంలోకి దించారు. సైన్యం, అసోం రైఫిల్స్ ఇతర పారా మిలిటరీ బలగాలు కల్లోలిత జిల్లాల్లో 24 గంటలు పహారా కాస్తున్నాయి. ఇండో-మయన్మార్ సరిహద్దులో దాగిన తిరుగుబాటు గ్రూపులు శాంతికి విఘాతం కలిగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 3న ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు ఇంఫాల్‌లో భారీ ప్రదర్శన చేసేందుకు పిలుపునిచ్చారు. వేలాది మంది గిరిజనులు, కొండజాతి ప్రజలు రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మైతీలను ఎస్‌టిల జాబితాలో కలపాలని తెర వెనుక జరుగుతున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా గిరిజన సంఘాలు ఈ ప్రదర్శన చేపట్టారు. పెద్ద సంఖ్యలో నాగా, కుకిలు,ఇతర తెగలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ ప్రదర్శన జరుగుతున్న సందర్భంలోనే గిరిజనులను మైతీ కులస్థులకు చెందిన వారు కొందరు ట్రక్కుతో గుద్దడం జరిగింది. ఈ కారణంగానే గిరిజనులకు, గిరిజనేతరులకు మధ్య వివాదం తలెత్తి తీవ్ర ఘర్షణగా మారింది. మణిపూర్ మంటల పూర్ గా మారింది.
దాదాపుగా నలబై రోజులు కావస్తున్నా మణిపూర్ అల్లర్లు ఇంకా అక్కడక్కడ కొనసాగుతున్నాయి. తాజాగా బిష్ణుపూర్ జిల్లాలో ఒక తెగకు చెందినవారు కొన్ని గ్రామాలపై విరుచుకుపడి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించడంతో తీవ్ర విధ్వంసం రేగింది. భయం గుప్పిట చిక్కుకున్న మణిపూర్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలో వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. ప్రజలు ఇండ్లలోనే ఉండాలని భద్రతా దళాలు సూచించాయి. రాష్ట్రమంతటా ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. కొద్ది గంటల సడలింపుతో కర్యూ కొనసాగిస్తున్నారు. శాంతి భద్రతల కోసం 10 వేల మంది సైనికులను రాష్ట్రమంతటా మోహరించినట్టు సర్కారు తెలిపింది. సోమవారం జరిగిన హింసకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేతో పాటు ఇద్దరిని అరెస్టు చేసినట్టు సీఎం బిరేన్ సింగ్ వెల్లడించారు. ఇంఫాల్‌లో మైతీ, కుకీల మధ్య రేగిన వాగ్వాదం అనేక ఇళ్ళు, దుకాణాల దహనానికి దారితీసింది. ఈ ఘర్షణలను నివారించేందుకు అసోం రైపిల్స్ బలగాలు పెద్ద ఎత్తున కవాతు చేస్తున్నాయి. డ్రోన్ కెమెరాలు, హెలికాప్టర్లతో ఆకాశం నుండే నిఘా పర్యవేక్షణ జరుగుతోంది.పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో నేడు మణిపూర్ రాష్ట్రాన్ని అప్రకటిత కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది.
గత ఏడాది మార్చిలో మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీరేన్‌సింగ్ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న చాలా నిర్ణయాలు ఆదివాసుల్లో అవిశ్వాసానికి కారణం. వారి అధీనంలో ఉన్న అటవీభూములను రిజర్వుఫారెస్టుగా మార్చేందుకు ప్రయత్నించడం, వారి గ్రామాలను అక్రమమైనవిగా ప్రకటించడం, రాష్ట్రంలో ఎన్ఆర్సి అమలుచేయాలని అనుకోవడం ఆదివాసులను ఆగ్రహానికి గురిచేసింది. ఇప్పటి వరకు 12 మంది ముఖ్యమంత్రులు మణిపూర్ ను పరిపాలించగా, వారిలో పది మంది బ్రాహ్మణ హిందువులకు సంబంధించిన మైతీ వర్గం వారే. కేవలం ఇద్దరు మాత్రమే గిరిజన తెగలకు సంబంధించిన వారు. జనాభాలో సమాన నిష్పత్తిలో ఉన్నప్పటికీ అసెంబ్లీ, పార్లమెంటు, స్థానిక సంస్థల రాజకీయ పదవులలో మూడొంతుల్లో రెండొంతుల మంది గిరిజనేతరులు ఉన్నారు. అటవీ జాతులకు సంబంధించిన కుకీ, నాగాలు కొండలు, లోయల్లో సరైన జీవనాధారం కరువైన పరిస్థితుల్లో నివసిస్తున్నారు. గిరిజనులకు అటవీ పరిరక్షణ చట్టాలు, షెడ్యూల్డ్ ఏరియా చట్టాలు, గిరిజన హక్కులు, గిరిజన రక్షణ చట్టాలున్నాయి.ఈ చట్టాలను పాలకులు ఉద్దేశపూర్వకంగానే నీరుకార్చేందుకు పూనుకున్నారు. గిరిజన చట్టాలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా గిరిజనులను అణచివేస్తున్న పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో, తమకు ఎస్టీ హోదా కల్పించే ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలేదంటూ మైతీలు హైకోర్టులో ఫిర్యాదు చేయడం, నాలుగువారాల్లో నిర్ణయం చేయమంటూ మణిపూర్ హైకోర్టు ఆదేశించడం, దీనికి ముందుగానే కేంద్రప్రభుత్వ ఆదివాసీ మంత్రిత్వశాఖ అనుకూలమైన వైఖరి ప్రదర్శించడం ఆదివాసుల భయాన్ని మరింత పెంచింది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మైతీలకు ఎస్టీ హోదా కట్టబెట్టేదిశగా వడిగా అడుగులు వేస్తుండటంతో ఆదివాసీ సంఘాలు మే 3న ఒక సదస్సు నిర్వహిస్తే, కొందరు మైతీలు దాడులు చేశారు. వందలాది చర్చీలు ధ్వంసం కావడం, ఆదివాసీ గ్రామాలు తగలబడటంతో విధ్వసం మొదలైంది. కేంద్రబలగాలు రంగంలోకి దిగి అంతా సర్దుమనిగించిన ఇంకా అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. తాజాగా జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించడంతో మరోసారి విధ్వంస ఖండా జరిగే అవకాశముందని అక్కడ భారీగా పోలీసులు ,కేంద్రబలగాలు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నాయి.