Tension in IT Employees: ఐటీ ఉద్యోగుల్లో టెన్షన్… రోజుకు 3 వేల మంది ఔట్
Tension in IT Employees: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం, ఇతర భయాల కారణంగా ప్రముఖ దిగ్గజ కంపెనీలు భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆయా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ కొంతమేర భారాన్ని తగ్గించుకుంటున్నాయి. తాజా నివేదికల ప్రకారం జనవరి 1 నుండి రోజుకు 3 వేల మందిని తొలగిస్తున్నాయి. మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ట్విట్టర్ వంటి ప్రముఖ కంపెనీలతో పాటు, దేశీయ కంపెనీలు, చిన్నా చితకా కంపెనీలు ఉద్యోగులను పక్కన పెడుతున్నాయి. ఏరోజు ఎవరి ఉద్యోగం ఊడిపోతుందోనని ఉద్యోగులు ఆందోళనలు చెందుతున్నారు.
గతేడాది ఫిబ్రవరి నెలాఖరులో ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచం క్రమంగా ఆర్థిక మాంద్యంలోకి దిగజారుతూ వచ్చింది. రష్యా నుండి సరఫరా కావలసిన చమురు యూరప్ దేశాలకు నిలిచిపోవడంతో యూరప్ దేశాలు విలవిలలాడిపోతున్నాయి. తద్వారా యూరప్‌లోని అనేక కంపెనీలు మూతపడ్డాయి. ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వేలాది మంది ఉద్యోగాలు కొల్పోవలసి వచ్చింది.
ఉక్రెయిన్ నుండి ఆహార ధాన్యాలు యూరప్, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. కానీ, యుద్ధం దెబ్బతో పంటలు దెబ్బతిన్నాయి. ఆహార ధాన్యాలకు తీవ్రమైన కొరత ఏర్పడింది. ఈ కొరత కారణంగా, దానికి సంబంధించిన ఆహార పరిశ్రమలు దెబ్బతిన్నాయి. దీనికి రిలేటెడ్‌గా కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు కూడా దెబ్బతిన్నాయి. ఇక, అమెరికాలో ఆర్థిక మాంద్యం క్రమంగా పడగ విప్పుతున్నది. ద్రవ్యోల్బణం రేటు ఎప్పుడూ లేనంతా పెరిగిపోతున్నది. అమెరికాలో చమురు ఉత్పత్తి అవుతున్నా, అవసరాలకు, ఎగుమతులకు సరిపోవడం లేదు. రష్యా నుండి వచ్చే చౌకైన ఆయిల్‌ను అమెరికా వినియోగించుకుంటూ రావడం, ఆంక్షల కారణంగా రష్యా చమురు ఆగిపోవడంతో దేశంలో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ధరలు పెరుగుదలతో ద్రవ్యోల్భణం పెరగడం, డాలర్ మారక విలువ పడిపోవడంతో మాంద్యం ఏర్పడింది. సాఫ్ట్‌వేర్ ఆర్డర్లు సైతం మందగించడంతో పలు కంపెనీలు తమ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించడం మొదలుపెట్టాయి.
ఈ క్రమంలో ఎలాన్ మస్క్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ట్విట్టర్‌ను కొనుగోలు చేసి భారీ మార్పులు చేపట్టారు. ఉద్యోగులను వరసగా తొలగించాడు. అనవసరమైన బిల్డింగ్‌లను అమ్మేస్తున్నారు. సంస్థల్లో నిరుపయోగంగా ఉన్న వాటిని వేలం వేయిస్తున్నారు. ఉద్యోగులకు ఇచ్చే అలవెన్స్, ప్రోత్సాహకాల్లో కోతలు విధించారు. తద్వారా కొంతమేర అదనపు భారాన్ని తగ్గించుకుంటున్నారు.
టెక్ కంపెనీల డేటా ప్రకారం, ప్రపంచంలోని 165 టెక్ కంపెనీలు 65 వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. గూగుల్ సంస్థ తన కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందిలో 6 శాతం మంది అంటే 12 వేల మందిని తొలగించింది. అదేవిధంగా, మైక్రోసాఫ్ట్ సంస్థ 10 వేల మందిని, అమెజాన్ 18 వేల మందిని, షేర్ చాట్ 500 మందిని, విప్రో 452 మందిని, మెడిబడ్డీ 2 వేల మందిని తొలగించింది.
ఫుడ్ యాప్ స్విగ్గీ 380 మంది ఉద్యోగులను తొలగించగా, ఓలా సంస్థ 200 మందిని పక్కన పెట్టింది. అదేవిధంగా ప్రముఖ సైబర్ సెక్యూరిటీస్ సంస్థ సోఫోస్ 450 మంది ఉద్యోగులను విధుల నుండి తొలగించింది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఫ్రెషర్స్‌తో పాటు కంపెనీల్లో ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నవారు కూడా ఉండటం విశేషం. తాజా డేటా ప్రకారం గతేడాది 1000 కంపెనీలు 1.54 లక్షలమంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్థిక మాంద్యం ఎంతకాలంపాటు ఉంటుందో చెప్పలేని పరిస్థితి అని, ఈ పరిస్థితుల నుండి గట్టెక్కే వరకు భారాన్ని తగ్గించుకోక తప్పదని నిపుణులు చెబుతున్నారు.