Minister Ktr: పారిశ్రామిక వేత్తలతో మంత్రి కేటీఆర్ భేటీ
Minister Ktr: గురువారం ముంబైలో పలువురు పారిశ్రామిక వేత్తలతో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు భేటీ అయ్యారు. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో టాటా కార్పొరేట్ కేంద్ర కార్యాలయం-బాంబే హౌస్‌లో సమావేశమై వివిధ వ్యాపార వాణిజ్య అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణలో టాటా గ్రూప్ కార్యకలాపాలు కొనసాగుతున్న తీరుపై చంద్రశేఖరన్ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, తమ ప్రభుత్వం అమలుచేస్తున్న అత్యుత్తమ పారిశ్రామిక విధానాలపై మాట్లాడిన మంత్రి కేటీఆర్, తెలంగాణ రాష్ట్రంలో టాటా గ్రూపు కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఉన్న అవకాశాలను ఆయా రంగాల వారీగా వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూల పరిస్థితులు, అవకాశాలను దృష్టిలో ఉంచుకొని టాటా గ్రూపు వివిధ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు.
ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా టాటా గ్రూప్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని తెలిపిన కేటీఆర్, టిసిఎస్ కార్యకలాపాలను వరంగల్ కు విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. జేఎస్‌డబ్ల్యూ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్‌తో ఆ సంస్థ కేంద్ర కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ ఏర్పడినప్పుడు బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చిందని, అకడ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సెయిల్ సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. బయ్యారంతో పాటు పకనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఇనుప ఖనిజం నిల్వలను దృష్టిలో ఉంచుకొని అకడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశం ఉన్నదని వివరించారు. జేఎస్‌డబ్ల్యూ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకువస్తే, అన్ని సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. జిందాల్ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విద్య, క్రీడారంగం వంటి ఇతర రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని జిందాల్ ని కేటీఆర్ కోరారు.