KTR in Mumbai: ముంబైలో పారిశ్రామిక దిగ్గజాలతో కేటీఆర్ భేటీ
Telangana IT Minister KTR in Mumbai to attract investments
తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముంబైలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో టాటా కార్పోరేట్ కేంద్ర కార్యాలయం బాంబే హౌస్ లో మంత్రి సమావేశమై వివిధ వ్యాపార వాణిజ్య అవకాశాలపైన చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, తమ ప్రభుత్వం అమలుచేస్తున్న అత్యుత్తమ పారిశ్రామిక విధానాలపై మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో టాటా గ్రూపు కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఉన్న అవకాశాలను ఆయా రంగాల వారీగా వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూల పరిస్థితులు, అవకాశాలను దృష్టిలో ఉంచుకొని టాటా గ్రూపు వివిధ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. టాటా గ్రూపు వివిధ రంగాల్లో చేపట్టనున్న విస్తరణ ప్రణాళికలో తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా చంద్రశేఖరన్ ను కేటీఆర్ కోరారు.
ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా టాటా గ్రూప్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని తెలిపిన కేటీఆర్, టిసిఎస్ కార్యకలాపాలను వరంగల్ కు విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీ ప్రణాళికలతో టాటా గ్రూప్ ముందుకు పోతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్స్ పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని వివరించిన కేటీఆర్, ఈ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. విమానయాన రంగంలో టాటా సంస్థ మంచి పురోగతి సాగిస్తున్న నేపథ్యంలో… హైదరాబాదులో ఒక Maintenance, Repair, and Overhaul (MRO) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
హిందుస్థాన్ లీవర్ కంపెనీ సంస్థ ఎండీ సంజీవ్ మెహతాతో కూడా సమావేశం అయ్యారు. హిందుస్థాన్ యూనీ లీవర్ సంస్థ హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను వివరించారు.FMCG రంగంలో హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.