TN Gov: తమిళనాడు పేరు మార్చాలి.. గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యాఖ్యలు
TN Governor RN Ravi: తమిళనాడు పేరును ‘తమిళగం’ లా మార్చాలంటూ తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా హాట్ టాపిక్ గ మారాయి. ద్రవిడ రాజకీయాలపై చేసిన ఆయన వ్యాఖ్యలపై సైతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)తో పాటు అన్ని రాజకీయ పక్షాలు గవర్నర్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ వ్యాఖ్యలు చేసారు.
గవర్నర్ వ్యవహారశైలిపై డీఎంకే కూటమిపక్షాలతో పాటు ఈ సారి అన్నాడీఎంకే కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనిపై రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి మాట్లాడుతూ డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చొరవతో మద్రాసు రాష్ట్రం గా వున్న పేరును తమిళనాడు అని నామకరణం చేశారని ఆ పేరే దశాబ్దాలుగా కొనసాగుతుండగా గవర్నర్ కొత్త పేరు సూచించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విధంగా ఎండీఎంకే నేత వైగో, అమ్మామక్కల్ మున్నేట్ర కళగం నాయకుడు దినకరన్, మనిదనేయ మక్కల్ కట్చి నేత జవాహిరుల్లా వేర్వేరు ప్రకటనలో గవర్నర్ ఆర్ఎన్ రవి బీజేపీ నేతలా వ్యవహరిస్తున్నారని రాష్ట్రంలో చిచ్చురగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.