CM Stalin : విపక్షాలన్నీ ఏకం కావాలి… కాంగ్రెస్ రహిత కూటమి సరికాదు
CM Stalin Comments on 2024 Lok Sabha Elections: డీఎంకే అధినేత ఎంకె స్టాలిన్ 70వ జన్మదిన వేడుకలు చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలను చెన్నైలోని వైఎంసీఏ గ్రౌండ్ లో భారీగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో స్టాలిన్ తో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఫరూఖ్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే విపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. విపక్షాలు ఏకమైతేనే బీజేపీని ఓడించడం సాధ్యం అవుతుందని అన్నారు.
కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ ఏర్పడటంగాని, లేదా బీజేపీని ఓడించడంగాని జరగదని తెలిపారు. కాంగ్రెస్ లేకుండా మూడో ఫ్రంట్ సాధ్యం కాదని అన్నారు. ప్రధాని అభ్యర్థి ఎవరు అన్నది ఇక్కడ ముఖ్యం కాదని, బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. విపక్షాల కూటమి ప్రధాని అభ్యర్థిగా స్టాలిన్ అయినా కావొచ్చని ఫరూఖ్ అబ్ధుల్లా పేర్కొనడం విశేషం. కాంగ్రెస్ అభ్యర్థే ప్రధాని కావాలని ఏమీ లేదని అయన తెలిపారు. ఈ సభలో ఎప్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేతల తేజస్వీ యాదవ్‌లు కూడా ప్రసంగించారు. ఇక ఇదిలా ఉంటే, ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌లను ఆహ్వానించకపోవడం విశేషం.