Governor Ravi: తమిళనాడు అసెంబ్లీలో వింత ఘటన.. గవర్నర్ వాకౌట్!
Tamil Nadu Governor Ravi walks out of Assembly: తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య ఏర్పడిన దూరం అంతకంతకూ పెరుగుతోంది. గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం చర్చనీయాంశం అయింది. అసెంబ్లీలో సంప్రదాయంగా గవర్నర్ చేసే ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే రికార్డులో ఉంచాలని, గవర్నర్ చేర్చిన వ్యాఖ్యలను తొలగించాలని సీఎం స్పీకర్‌ను కోరడంతో గవర్నర్ అలిగి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన గవర్నర్ ఒరిజినల్ స్పీచ్ మాత్రమే రికార్డు చేయాలని పార్టీ తరపున అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగంలో నుంచి సెక్యులరిజం, పెరియార్, బీఆర్ అంబేద్కర్, కే కామరాజ్, సీ ఎన్ అన్నాదురై, కరుణానిధి వంటి రిఫరెన్సులను గవర్నర్ చదవలేదు. గవర్నర్ ఆర్ఎన్ రవి తన ప్రసంగంలో వీటిని తప్పించడంతో సీఎం గవర్నర్ తీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నదని తీర్మానం ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎమ్మెల్యేలు. కీలకమైన బిల్లులను క్లియర్ చేయడంలో గవర్నర్ ఆర్ఎన్ రవి ఉద్దేశపూర్వకంగానే జాప్యం వహిస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నారు తమిళనాడు ఎమ్మెల్యేలు.