తెలుగువారి మనసు దోచిన తమిళ సీఎం స్టాలిన్
తమిళులకు మాతృభాషంటే ప్రాణం. అందునా అధికార డీఎంకేకి మరీ మమకారమెక్కువ. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కరుణానిధి తెలుగువాడైనా తమిళాన్నే ఎక్కువ ప్రోత్సహించారు. కానీ ఆయన కుమారుడు, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాత్రం ఒక తెలుగు మహిళను మనస్ఫూర్తిగా అభినందించి వార్తల్లో నిలిచారు. తమిళ ప్రసంగాన్ని తెలుగులో రాసుకొచ్చి చదివినందుకు ప్రత్యేకంగా ప్రశంసించారు. తద్వారా ఆయన అటు తమిళ తంబీలతోపాటు ఇటు తెలుగువారి మనసునూ దోచారు.
అసలు విషయం ఏంటంటే..
ఈ నెల 24న కాంచీపురం జిల్లాలోని సెంగాడు గ్రామ పంచాయతీలో ఓ సభ జరిగింది. జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆ మీటింగుకి సీఎం స్టాలిన్ సహా పలువురు పెద్దలు హాజరయ్యారు. వాళ్లందరికీ గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు చెంచురాణి ఘన స్వాగతం పలికారు. అనంతరం తమిళంలో ప్రసంగించారు. అయితే ఆమె ఆ సమయంలో కొంచెం తడబాటు పడటాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ గమనించారు. ప్రసంగం పూర్తయ్యాక.. ‘ఏమ్మా నువ్వు తెలుగు మహిళవా?’ అని అడిగారు. అందుకామె ‘అవును సార్’ అని చెప్పింది. ‘మీ కోసమే తమిళంలో మాట్లాడాను. తప్పులుంటే క్షమించండి’ అని కోరింది. దానికి ఆయన స్పందిస్తూ ‘నువ్వు ఏ తప్పూ చేయలేదు. తమిళంలో ప్రసంగించేందుకు నువ్వు చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. మీరూ మెచ్చుకోండి’’ అని చెప్పడంతో సభ చప్పట్లతో మారుమోగింది.