Uddhav Thackeray: మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంపై మీరేమంటారు – ప్రధానికి థాకరే డిమాండ్
Uddhav Thackeray: మహారాష్ట్ర -కర్ణాటక సరిహద్దు వివాదంపై ప్రధాని మోడీ తన వైఖరిని స్పష్టం చేయాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే డిమాండ్ చేశారు. నాగపూర్ – ముంబయి సూపర్ కమ్యూనికేషన్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించేందుకు ప్రధాని మోడీ మహారాష్ట్రలో నేడు పర్యటించనున్నారు. జల్నా వద్ద 42వ మరట్వాడా సాహిత్య సమ్మేళన్ ప్రారంభోత్సవంలో శనివారం ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ కర్ణాటకతో నలుగుతున్న సరిహద్దు సమస్యతో పాటు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న పలు సమస్యలను మోడీ పరిష్కరించాల్సి వుందని చెప్పారు.
మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలోని జత్ తాలుకాలో గల కొన్ని గ్రామాలపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బమ్మై చేస్తున్న వాదన గురించి మోడీ మాట్లాడాలని ఆయన అన్నారు. దశాబ్దాల నాటి ఈ సమస్య ఇటీవల తారాస్థాయికివెళ్లిందని అన్నారు. గత నెల 22న బమ్మై మాట్లాడుతూ, జత్ తాలుకాపై తమ రాష్ట్రానికి గల హక్కు గురించి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోందని అన్నారు. ఆ ప్రకటనతో మహారాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. కేవలం సెమినార్లు పెడితే సరిపోదని, రచయితలు కూడా వీధుల్లోకి వచ్చి పాలకుల తప్పులను ప్రశ్నించాలని అన్నారు. కానీ, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారిని జైళ్లకు పంపుతున్నారని థాకరే వ్యాఖ్యానించారు.