రాహుల్ తో టీ కాంగ్రెస్ నేతల భేటీ..రాష్ట్రానికి ఆహ్వానం!
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలువనున్నారు. సాయంత్రం 4 గంటలకు టీ.కాంగ్రెస్ నేతలకు రాహుల్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. డిజిటల్ మెంబర్ షిప్‌కు సంబంధించిన చెక్స్‌ను రాహుల్‌కు టీ.నేతలు అందచేసే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో రాహుల్ సభ, ఇతర అంశాలపై నేతలతో రాహుల్ గాంధీ చర్చించనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, మధు యాష్కీ, దామోదర రాజనర్సింహ, మహేశ్వర్ రెడ్డి.. రాహుల్‌ను కలువనున్నారు. అయితే ఇంధన ధరలు, విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఏప్రిల్ నెలాఖరు వరకు తమ నిరసన కార్యక్రమాలు కొనసాగించనుంది. రైతులకు సంఘీభావంగా వరంగల్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెంపు, విద్యుత్ ఛార్జీల పెంపు అంశాలను ప్రజల్లోకి దూకుడుగా తీసుకెళ్లాలని పీసీసీ చీఫ్ ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మంథని ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు నేతృత్వంలో కమిటీ వేయాలని ప్రతిపాదించారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా మార్చి 31న గ్రామాల్లో డప్పు దండోరా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2 నుంచి 4 వరకు మండలాలు, నియోజక వర్గాల్లో ఆందోళనలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7వ తేదీన సివిల్ సప్లై కార్యాలయం, విద్యుత్ సౌధ వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది.