MonkeyPox: భారత్లో వెలుగులోకి మంకీపాక్స్ వైరస్ లక్షణాలు
MonkeyPox Symptoms:ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పూర్తిగా అంతరించిపోకముందే.. మంకీపాక్స్ వైరస్ ప్రపంచాన్ని బెంబ్బలెత్తిస్తోంది. ఇప్పటి వరకు 50కి పైగా దేశాలకు ఈ వైరస్ విస్తరించగా.. వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వచ్చాయి. భారత్లో ఇప్పటి వరకు ఈ కేసులు నమోదు కాకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. కాగా భారత్లో సైతం మంకీపాక్స్ తరహా కేసులు వెలుగులోకి వస్తోండడంతో భయాందోళనకు గురిచేస్తోంది.
కేరళలోని తిరువనంతపురంలో ఓ వ్యక్తి మంకీపాక్స్ తరహా లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. బాధితుడు ఇటీవలే విదేశాల నుంచి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. వైరస్ నిర్ధారణ పరీక్షల నిమిత్తం అతడి నుంచి సేకరించిన నమూనాలను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు తెలిపారు. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత వ్యాధిని ధ్రువీకరిస్తామన్నారు. సదరు వ్యక్తి విదేశాల్లో మంకీపాక్స్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినట్లు మంత్రి తెలిపారు. అయితే, ఆ వ్యక్తి వయసు, ఏ దేశానికి వెళ్లొచ్చారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు.
మరోవైపు గత కొన్ని రోజులుగా మంకీపాక్స్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు 59 దేశాల్లో ఈ వైరస్ జాడ బయటపడగా.. 6వేలకు పైగా కేసులు.. మూడు మరణాలు కూడా నమోదయ్యాయి. అయితే, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో 80శాతం కేవలం యూరప్ దేశాల్లోనే బయటపడ్డట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.