Supreme Court key decision on Verdicts: నేటి నుండి ప్రాంతీయ భాషల్లో తీర్పులు
Supreme Court key decision on Verdicts: భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈరోజు నుండి సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పులను ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులో ఉంచనున్నట్లు చీఫ్ జస్టీస్ ఆఫ్ ఇండియా జస్టిస్ చంద్రచూడ్ తెలియజేశారు. సుప్రీంకోర్టు వెబ్ సైట్‌లో ఇప్పటి వరకు 34 వేల తీర్పు కాపీలు ఉన్నాయని, అందులో కొన్నింటిని ఇప్పటికే వివిధ భాషల్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్టుల ప్రాజెక్ట్ నేటి నుండి ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ తీర్పులను న్యాయవాదుల నుండి సామాన్య ప్రజల వరకు ఎవరైనా వినియోగించుకోవచ్చని, ఇప్పటికే కొన్ని తీర్పు కాపీలను వివిధ భాషల్లోకి అనువాదం చేయడం జరిగిందని అన్నారు.
వీలైనంత త్వరలోనే అన్ని తీర్పులు గుర్తించిన అన్ని భాషల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. తీర్పు కాపీలు స్థానిక భాషల్లో అందుబాటులో ఉండటంతో కీలకమైన తీర్పులను అర్థం చేసుకోవడం సులభం అవుతుందని సుప్రీంకోర్టు తెలియజేసింది. సుప్రీంకోర్టు తీర్పుల ట్రాన్స్‌లేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని, గుర్తించిన భాషలన్నింటిలోకి అనువాదం జరుగుతుందని సీజేఐ జస్టీస్ చంద్రచూడ్ తెలియజేశారు. కాగా, సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. స్థానిక భాష మాత్రమే తెలిసిన వారికి కూడా తీర్పులు క్షుణ్ణంగా అర్థమౌతాయని ప్రజలు, రాజకీయ నాయకులు చెబుతున్నారు.