Supreme Court on Vijay Malay case: విజయ్ మాల్యాకు నాలుగు నెలల జైలు శిక్ష..2వేలు జరిమానా
Supreme Court on Vijay Malay case: కింగ్ ఫిషర్ మాజీ అధినేత, బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు 4 నెలల జైలు శిక్షను విధించింది. అంతేకాదు 2 వేల రూపాయల జరిమానాను విధిస్తూ తీర్పు ఇచ్చింది. 2017లో విజయ్ మాల్యా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. కేసులో భాగంగా 40 మిలియన్ డాలర్ల సొమ్మును తన పిల్లలకు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ విషయాన్ని కోర్టుకు చెప్పకుండా దాచారు. అంతేకాకుండా, కేసులో పలుమార్లు కోర్టుకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినా హాజరుకాకపోవడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బదిలీ చేసిన 40 మిలియన్ డాలర్ల సొమ్మును నాలుగు వారాల్లోగా వడ్డీతో చెల్లించాలని లేదంటే మాల్యా ఆస్తులను జప్తు చేయాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నది.
2016 మార్చి నుంచి విజయ్ మాల్యా యునైటెడ్ కింగ్డమ్లో నివసిస్తూ ఉన్నారు. 2017 ఏప్రిల్ 18న స్కాట్లాండ్ యార్డ్ ఈయనపై ఎక్స్ట్రడిక్షన్ వారెంట్ జారీ చేసింది. అయితే దీనిపై ఆయన బెయిల్ తెచ్చుకున్నారు. కాగా విజయ్ మాల్యా బ్యాంకులకు రూ. 9 వేల కోట్లు ఎగనామం పెట్టిన విషయం తెలిసిందే. కింగ్ ఫిషన్ ఎయిర్లైన్స్ కోసం తీసుకున్న రుణాలను చెల్లించకుండా దేశం విడిచి పారిపోయారు. బ్యాంకుల కన్సార్షియానికి సారథ్యం వహిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాల్యా తీసుకున్న రుణాలు చెల్లించడంలో కోర్టు ఆదేశాలను అనుసరించడం లేదని సుప్రీం కోర్టుకు వెళ్లింది.