SC Collegium: హైకోర్టు జడ్జీలుగా 9 మంది పేర్లు సిఫారసు
Supreme Court Collegium: సుప్రీంకోర్ట్ కొలీజియం మరోసారి 9 మంది పేర్లను సిఫారసు చేస్తూ కేంద్రానికి దస్త్రాలను పంపింది. హైకోర్టు జడ్జీల పదవుల కోసం 9 మంది పేర్లను సూచించింది. ఇలా పేర్లను సూచించిన వారిలో ఏడుగురు జ్యూడిషియల్ అధికారులు ఉండగా, ఇద్దరు న్యాయవాదులు ఉన్నారు. ఈ ఏడుగురు జ్యూడిషియల్ అధికారుల్లో ఇద్దరు ఏపీ హైకోర్టుకు చెందిన అధికారులు కూడా ఉండటం విశేషం. ఏపీకి చెందిన పి వెంకట జ్యోతిర్మయి, వి గోపాలకృష్ణలు ఉన్నారు. వీరికి హైకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించాలని కోరుతూ కొలీజియం సిఫారసు చేసింది. వీరితో పాటు కర్ణాటకకు చెందిన జ్యూడిషియల్ అధికారులు రామచంద్ర దత్తాత్రేయ, వెంకటేశ్ నాయక్‌లు కూడా ఉన్నారు. వీరితో పాటుగా ప్రముఖ న్యాయవాది నాగేంద్ర రామచంద్ర నాయక్ పేరును కూడా సుప్రీంకోర్టు కొలీజియం తన సిఫారసులో పేర్కొన్నది.
అయితే, గతంలో కొలీజియం సూచించిన 104 మంది పేర్లలో 44 మంది నియామకాలకు కేంద్రం త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని కేంద్రం తరపు న్యాయవాది కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టుకు తెలియజేసిన సంగతి తెలిసిందే. కేంద్రం, సుప్రీంకోర్టు కొలీజియం మధ్య జడ్జీల నియామకం విషయంలో రగడ జరుగుతున్నది. రాజ్యాంగ బద్ధంగా నియామకాలు జరగాలని కేంద్రం పట్టుబడుతుంటే, సంప్రదాయంగా వస్తున్న కొలీజియం పద్దతి ద్వారానే జడ్జీల నియామకం జరగాలని సుప్రీంకోర్టు పట్టుబట్టింది. కేంద్రం ఓ మెట్టుదిగిరావడంతో ఈ సమస్య అక్కడితో ఆగిందని చెప్పవచ్చు.