బీహార్ కంటే వెనుక “బడి” – తెలుగు రాష్ట్రాల్లో చదువు..చట్టు బండ..!
Students in Telugu States lagging behind Bihar and Rajasthan in Reading and Numerical skills
దేశ వ్యాప్తంగా ఉన్నపాఠశాలల్లో విద్యార్ధుల చేరికలు, విద్యార్ధుల బేసిక్ లెర్నింగ్ ఏ విధంగా ఉందనే అంశాలపై చేపట్టిన విద్యా సర్వే అనేక విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ప్రథమ్ సంస్థ చేపట్టిన ఈ సర్వేలో ఊహించని వాస్తవాలు వెలుగుచూశాయి. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో విద్యార్ధులు సరైన గైడెన్స్ లేక వెనకబడిపోయారు. వారిలో విద్యాప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. తెలుగు రాష్ట్రాలు చాలా విషయాల్లో బాగా వెనకబడి ఉన్నట్లు ఈ సర్వే ద్వారా స్పష్టమయింది. రీడింగ్ ఎబిలిటీ, న్యూమరసీ స్కిల్స్ చాలా వరకు తగ్గినట్లు సర్వే ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి.
తెలంగాణ స్కూల్స్ లో విద్యాప్రమాణాలు
5 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసు కలిగిన విద్యార్ధుల విద్యాప్రమాణాలను సర్వే చేయడం ద్వారా పరిశీలించారు. అక్షరాలు, పదాలు, వాక్యాలు చదవగలిగే వారు ఎంత మంది ఉన్నారనే విషయాన్ని లెక్కగట్టారు. తెలంగాణలో మూడో తరగతి చదువుతున్న పిల్లల్లో 12.4 శాతం మంది కనీసం అక్షరాలను కూడా చదవలేకపోతున్నారని సర్వే ద్వారా తేల్చారు. అదే విధంగా 28.5 శాతం పిల్లలు అక్షరాలను చదవగలిగినా, పదాలను చదవలేకపోతున్నారని తేలింది.
అర్థమెటిక్ ఎబిలిటీ విషయంలో కూడా తెలంగాణ విద్యార్ధులు వెనకబడి ఉన్నట్లు తేలింది. మూడవ తరగతి చదువుతున్న విద్యార్దుల్లో 5.3 శాతం మంది కనీసం 1- 9 మధ్యలో గల అంకెలను గుర్తించలేకపోతున్నారు. 13.2 శాతం మంది విద్యార్ధులు 1-9 మధ్య గల సంఖ్యలను గుర్తించగలుగుతున్నారు, కానీ ఆ తర్వాతి సంఖ్యలను గుర్తించలేకపోతున్నారు. మూడో తరగతి చదువుతున్న విద్యార్ధుల్లో 53 శాతం మంది 1 నుంచి 99 అంకెలను గుర్తించగలుగుతున్నారు. ఇక తీసివేతలు, భాగాహారం విషయంలో విద్యార్ధులు వెనకబడి ఉన్నారు. 3 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్ధుల్లో ఇటువంటి వారు చాలా ఎక్కువుగా ఉన్నారు.
ఏపీలో కూడా తగ్గిన ప్రమాణాలు
ఏపీలో పరిస్థితి కూడా దారుణంగా ఉంది. సర్వే చేపట్టిన అనేక పాఠశాలల్లో విద్యార్ధులు కనీస అవగాహన లేకుండా ఉన్నారు. మూడో తరగతికి చెందిన విద్యార్ధుల్లో 12.6 శాతం విద్యార్ధులు కనీసం అక్షరాలను చదవలేని స్థితిలో ఉన్నారు. 24.3 శాతం విద్యార్ధులు అక్షరాలను గుర్తించగలిగినా..వాటిని చదవలేకపోతున్నారు.
మూడో తరగతికి చెందిన విద్యార్ధుల్లో 36.2 శాతం మంది పదాలను చదువుతున్నారు గానీ ఒకటో తరగతి పాఠ్యాంశాలను చదవలేకపోతున్నారు. 16.6 శాతం మంది విద్యార్ధులు ఒకటో తరగతి పాఠ్యాంశాలను చదువుతున్నారు గానీ, రెండో తరగతి పాఠ్యాంశాలను చదవలేకపోతున్నారు.
ఇక ఏపీలో న్యూమరికల్ స్కిల్స్ విషయానికి వస్తే.. మూడో తరగతికి చెందిన విద్యార్ధుల్లో 7.2 శాతం మంది కనీసం 1 నుంచి 9 మధ్య గల అంకెలను కూడా గుర్తించలేకపోతున్నారు. 12.4 శాతం మంది విద్యార్ధులు 1 నుంచి 9 మధ్య గల సంఖ్యలను గుర్తించగలుగుతున్నారు గానీ అంతకంటే పెద్ద సంఖ్యలను గుర్తించలేకపోతున్నారు. 46.7 శాతం మంది విద్యార్ధులు తీసివేతలు చేయలేకపోతున్నారు. 29.5 శాతం మంది విద్యార్ధులు తీసివేతలు చేయగలుగుతున్నారు గానీ భాగాహారం చేయలేకపోతున్నారు.
పెరుగుతున్న విద్యార్ధుల సంఖ్య
దేశ వ్యాప్తంగా స్కూల్స్ లో చేరుతున్న విద్యార్ధుల సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతోంది. గత 16 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా విద్యార్ధుల నమోదు జరిగినట్లు సర్వేలోని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018లో 97.2 శాతంగా ఉన్న విద్యార్ధుల నమోదు, 2022 నాటికి మరింత పెరిగింది. 98.4 శాతానికి చేరుకుంది. విద్యార్ధులు అధిక సంఖ్యలో స్కూల్స్ లో చేరడం శుభపరిణామమే అయినా వారిలో విద్యాప్రమాణాలు పడిపోవడం అనే అంశం దేశ వ్యాప్తంగా అనేక మందిని కలవరానికి గురిచేస్తోంది.