Sri Sri Ravi Shankar Helicopter emergency landing: ఆర్ట్ ఆఫ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్ హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Sri Sri Ravi Shankar Helicopter emergency landing: ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవి శంకర్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ఎమర్జెన్సీగా తమిళనాడులో ల్యాండ్ అయింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో హెలికాఫ్టర్‌ను ఈరోడ్ జిల్లాలోని కడంబూరు సమీపంలోని ఒక్కియం ప్రభుత్వ పాఠశాలలో ల్యాండింగ్ చేశారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వలనే పాఠశాల మైదానంలో ల్యాండ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. రవిశంకర్ తో పాటు ఈ హెలికాఫ్టర్‌లో మరో ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. ముగ్గురు క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలియజేశారు.
బెంగళూరు నుండి తిరుపుర్ జిల్లాలోని కాంగేయానికి ఆయన బయలుదేరి వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగింది. ఈరోడ్ జిల్లాకు చేరుకునే సరికి వాతావరణం అనుకూలించకపోవడంతో ఎమర్జెన్సీగా హెలికాఫ్టర్‌ను ఒక్కియం ప్రభుత్వ పాఠశాలలో ల్యాండింగ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కాగా, సుమారు గంటసేపు రవిశంకర్ పాఠశాలలోనే ఉన్నారు. పాఠశాల వద్దకు చేరుకున్న ప్రజలతో ఆయన కాసేపు ముచ్చటించారు. అనంతరం, ఆయన హెలికాఫ్టర్‌లో తిరిగి తిరుపుర్ జిల్లాకు బయలుదేరి వెళ్లారు. రవిశంకర్ హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యందని వార్తలు బయటకు వచ్చిన వెంటనే ఆయన భక్తులు హుటాహుటిన ఒక్కియం ప్రభుత్వ పాఠశాల వద్దకు చేరుకొని ఆయన క్షేమసమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.