Sonia Gandhi: ఢిల్లీలో టెన్షన్ టెన్షన్, నేడు మరోసారి సోనియాను విచారించనున్న ఈడీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 21న సోనియాను 2 గంటల పాటు విచారించిన దర్యాప్తు సంస్థ, ఈ రోజు మరోసారి విచారించనుంది. సోనియా గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో పోలీసు అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ప్రదర్శనలకు పిలుపునివ్వడంతో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. విచారణ సందర్భంగా ఏఐసీసీ కార్యాలయం వద్ద నేతలు, కార్యకర్తలు భారీగా గుమికూడుతున్నందున బందోబస్తును కట్టుదిట్టం చేశారు. అక్బర్ రోడ్లో 3 వరుసలుగా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి.. వాటర్ కెనాన్లను సిద్ధంగా ఉంచారు. 144 సెక్షన్ అమలు పరుస్తున్నారు. కార్యకర్తలు గుమికూడకుండా నిషేధాజ్ఞలు విధించారు.
తొలి రోజు విచారణ సందర్భంగా..
జూలై 21న జరిగిన విచారణ సందర్భంగా సోనియాగాంధీకి తోడుగా ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ కూడా వచ్చారు. కార్యాలయంలోని విచారణ గదికి సమీపంలోనే ఉన్నారు. వైద్యుల సలహా మేరకు తల్లికి అవసరమైన మందులను ఇచ్చేందుకు విచారణ పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలకు దిగారు. మోడీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. తమ అధినేత్రిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీలోని శివాజీ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ వద్ద యూత్ కాంగ్రెస్ పలు రైళ్లను కదలనివ్వకుండా అడ్డుకున్నారు. విపక్షాల గొంతును నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడీని దుర్వినియోగం చేస్తోందని తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వానికి, ఈడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నిరంతరం ఖూనీ చేస్తున్న మోడీ నియంత పాలనకు వ్యతిరేకంగా తాము ఆందోళన చేస్తున్నామని యూత్ కాంగ్రెస్ నేతలు తమ నిరసనను సమర్ధించుకున్నారు.
349 మంది కాంగ్రెస్ నేతలను అరెస్టు
జూలై 21న కాంగ్రెస్ చేసిన ఆందోళన కార్యక్రమాలను అడ్డుకున్న పోలీసులు ఏకంగా 349 మంది కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు. శశిథరూర్, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్, పవన్ ఖేరా, రణదీప్ హుడా తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ పోలీసు చట్టం ప్రకారం మొత్తం 56 మంది ఎంపీలను అదుపులోకి తీసుకున్నట్లు ఆ రోజున పోలీసులు వెల్లడించారు.
తొలి రోజున 28 ప్రశ్నలు సంధించిన అధికారులు
తొలి రోజున దర్యాప్తు అధికారులు 28 ప్రశ్నలకు సమాధానాలు కోరారు. రాత పూర్వకంగా సమాధానాలు ఇవ్వమని కోరారు. కొన్ని ప్రశ్నలకు సమాధానంగా తెలియదని, మరికొన్ని ప్రశ్నలకు సమాధానంగా మరిచిపోయానని సోనియాగాంధీ సమాధానమిచ్చినట్లు కొన్ని ప్రముఖ వార్తా సంస్థలు వెల్లడించాయి. కాంగ్రెస్ నేతృత్వంలో నడుస్తున్న యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఆర్ధిక అక్రమాలు జరిగాయని దర్యాప్తు సంస్థకు అందిన సమాచారంతో విచారణ జరుపుతోంది. రెండో సారి విచారణ సందర్భంగా ప్రియాంక గాంధీతో పాటు రాహుల్ గాంధీ కూడా సోనియాగాంధీతో పాటు ఈడీ కార్యాలయానికి రానున్నట్లు సమాచారం.
విచారణ సందర్భంగా అధికారులు కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తున్నారు. డాక్టర్లను అందుబాటులో ఉంచారు. విచారణ సందర్భంగా సోనియాగాంధీ అస్వస్థతకు గురైతే వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధంగా ఓ అంబులెన్స్ ను కూడా ఉంచారు. విచారణ అధికారులు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్లుతో విచారణకు హాజరుకానున్నారు.
భద్రత కట్టుదిట్టం
మరోవైపు పోలీసులు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈడీ కార్యాలయం ముందు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. C.R.P.F బలగాలను, RAF బలగాలను రంగంలోకి దించారు. సోనియా నివాసం నుంచి ఈడీ కార్యాలయం వరకు దాదాపు ఒక కిలోమీటర్ దూరాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.