Sonia Gandhi: సోనియాగాంధీకి అస్వస్థత, గంగారాం ఆసుపత్రిలో చికిత్స
Sonia Gandhi is Unwell, admitted into Gangaram Hopital
యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని, కొన్ని టెస్టులు చేసి అబ్జర్వేషన్ లో ఉంచుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గంగారాం ఆసుపత్రికి చెందిన డాక్టర్ అరుప్ బసు నేతృత్వంలోని సోనియాగాంధీకి చికిత్స అందిస్తున్నారు. బ్రోంకైటిస్ కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది జనవరి నెలలో ఓసారి సోనియాగాంధీ గంగారాం ఆసుపత్రిలో చేరారు. శ్వాసకోశ సంబంధ ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరారు. కొన్ని రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ అయ్యారు. 76 ఏళ్ల సోనియా గాంధీ గత ఏడాది కూడా అనేక ఆరోగ్యసమస్యలు ఎదుర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో విదేశాలకు వెళ్లి కూడా చికిత్స చేయించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం
2014 నుంచి అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. కేంద్రంలో అధికారం కోల్పోవడంతో పాటు కీలకమైన రాష్ట్రాలు కూడా చేజారిపోయాయి. పలు కీలక నేతలు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు నిర్వీర్యం అవుతోంది. ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గేకు పార్టీ బాధ్యతలు అప్పగించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ఇటీవలే రాయ్ పూర్ లో జరిగిన ప్లీనరీలో సోనియాగాంధీ సంకేతాలు పంపారు.