Siddaramaiah: యతీంద్ర సిద్దరామయ్య, కన్నడ ప్రజలు ఆప్యాయంగా పిలుచుకొనే పేరు సిద్దు. రాజకీయంగా కాకలు తీరిన యోధుడు. కాంగ్రెస్ వ్యతిరేక భావాలతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సిద్ధరామయ్య..ఆ తరువాత అదే పార్టీలో చేరి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు పోటీ తీవ్రంగా ఉన్న హైకమాండ్ తన వైపే మొగ్గేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్తానంలో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నారు. నాలుగు దశాబ్దాల కాలంలో ఎవరూ లేని విధంగా.. 5 సంవత్సరాలు పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగా ఉన్న తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు అనూహ్య పరిణామాల నడుమ సిద్దరామయ్య కర్ణాటక కు మరోసారి ముఖ్యమంత్రిగా ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సిద్దరామయ్య 1947 ఆగస్ట్ 3న జన్మించారు. కురుబ గౌడ సామాజిక వర్గానికి చెందిన సిద్ధరామయ్య వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. మైసూరు జిల్లాలోని మారుమూల గ్రామమైన సిద్ధరమణహుండీ ఆయన స్వగ్రామం. కుటుంబంలోని ఐదుగురు సంతానంలో సిద్ధరామయ్య రెండోవాడు. మైసూరు యూనివర్సిటీ నుంచి సిద్ధరామయ్య బీఎస్సీ, ఎల్ఎల్బీ పట్టాలు అందుకున్నారు. అనంతరం మైసూరు లా ప్రాక్టీస్ చేశారు. సిద్ధరామయ్య భార్య పార్వతి. వీరికి ఇద్దరు సంతానం కాగా.. పెద్ద కుమారుడు 38 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో 2016లో చనిపోయారు. చిన్న కుమారుడు యతీంద్ర. 2018లో యతీంద్ర వరుణ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సిద్దరామయ్య ఇవే తన చివరి ఎన్నికలని ప్రచారం చేసారు. ఎన్నికల్లో విజయం సాధించారు. మరోసారి సీఎం కాబోతున్నారు.
సిద్దరామయ్య రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. తొలుత స్వతంత్ర అభ్యర్థిగా తన రాజకీయ ప్రస్థానాన్నిప్రారంభించిన సిద్ధరామయ్య.. జనతాదళ్, జనతాదళ్ యునైటెడ్ పార్టీల్లో చేరారు. తర్వాత 2006 లో కాంగ్రెస్‌లో చేరి కీలక నేతగా ఎదిగారు. 1983 లో చాముండేశ్వరీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచి పాత మైసూరు ప్రాంతంలో కీలక నేతగా ఎదిగారు. 1985 మధ్యంతర ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి చాముండేశ్వరీ స్థానంలో విజయం సాధించి మంత్రి అయ్యారు. అనంతరం జనతా దళ్‌లో చేరిన సిద్ధరామయ్య 1989 లో తొలి ఓటమిని చవిచూశారు. 1994 ఎన్నికల్లో జనతాదళ్ పార్టీ నుంచి గెలుపొంది మరోసారి మంత్రి అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దరామయ్య ఇప్పటి వరకు తొమ్మది సార్లు విజయం సాధించారు. మూడు సార్లు ఓడిపోయారు.
స్వతంత్ర అభ్యర్ధిగా రాజకీయ జీవితం ప్రారంభించినా.. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పార్టీలు మార్పుల..ఎత్తులు, వ్యూహాలు మారుస్తూ రాజకీయంగా సీఎం స్థానం అందుకున్నారు. 1999లో జనతాదళ్ యునైటెడ్‌లో చేరిన సిద్ధరామయ్య ఆ ఏడాది ఎన్నికల్లో ఓడిపోయారు. 2004 ఎన్నికల్లో జేడీఎస్ తరఫున గెలిచారు. 2005 లో జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ.. సిద్ధరామయ్యను పార్టీ నుంచి బహిష్కరించారు. బెంగళూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. 2008, 2013 ఎన్నికల్లో వరుణ నుంచి విజయం సాధించారు. దీంతో 2013 నుంచి 2018 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పటివరకు 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 5 సంవత్సరాలు పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రిగా కొనసాగిన తొలి సీఎంగా సిద్ధరామయ్య నిలిచారు. 2018లో రెండు స్థానాల్లో పోటీ చేయగా.. చాముండేశ్వరీలో ఓడిపోయి, బదామీ స్థానంలో గెలిచారు.
2018 ఎన్నికల తరువాత రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయంలో కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి నుంచి 17 మంది తమ పదవులకు రాజీనామా చేసారు. 2019లో 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో, పార్టీలో ప్రత్యర్ధులు సిద్దరామయ్య నాయకత్వం పైన పరోక్ష పోరాటం ప్రారంభించారు. అసమ్మతి పెరగటంతో సీఎల్పీ నేత పదవికి రాజీనామా చేసారు. తాజా ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సెంటిమెంట్ ప్రయోగించి కాంగ్రెస్ నాయకత్వాన్ని తన వైపు తిప్పుకున్నారు. డీకే శివకుమార్ లాంటి బలమైన పోటీ దారుడిని కాదని తనకే సీఎం పదవి దక్కేలా చక్రం తిప్పారు. ఫలితంగా రెండో సారి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సిద్దమయ్యారు. ఈ సారి మాత్రం సిద్దరామయ్యకు సీఎం పదవి..పాలనా పరమైన నిర్ణయాలు సమర్ధతకు పరీక్షగా మారనున్నాయి.