Shocking Survey: కర్ణాటకలో బీజేపీకి పరాభవం తప్పదా… ఆ సర్వే నిజమేనా?
Shocking Survey: ఈ ఏడాది కర్ణాటక రాష్ట్రానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ, కాంగ్రెస్, జేడీయు పార్టీలు గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ పేరుతో ఓ సర్వే బయటకు వచ్చింది. ఆర్ఎస్ఎస్ సీక్రెట్‌గా ఓ సర్వే చేయించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ సర్వే ప్రకారం బీజేపీకి 50 నుండి 70 సీట్లు మాత్రమే వస్తాయని, కాంగ్రెస్ పార్టీకి 115 నుండి 120 వరకు సీట్లు వస్తాయని ప్రచారం జరుగుతున్నది. అయితే, ఈ సర్వేపై ఆర్ఎస్ఎస్ ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ సర్వే ఫేక్ సర్వే అని, కాంగ్రెస్ పార్టీ కావాలనే ఇలాంటి పుకార్లు పుట్టిస్తోందని, రాష్ట్రంలో బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి పనులు చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
రాష్ట్రంలో బీజేపీ సర్కార్ సంక్షేమంతో పాటు, అభివృద్ధి విషయంలోనూ ముందంజలో ఉందని కాషాయం నేతలు చెబుతున్నారు. ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఈ సర్వేపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ చివరి ప్రయత్నంగా ఫొటోషాప్ లను నమ్ముకుందని, దేశంలో కాంగ్రెస్ పార్టీ కాలం చెల్లిపోయిందని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. నిజంగానే ఆర్ఎస్ఎస్ సీక్రేట్ సర్వేను నిర్వహించిందా? సర్వే నిర్వహిస్తే బయటకు వచ్చిన సర్వే ఎంతవరకు నిజమన్నది ఆర్ఎస్ఎస్ ప్రకటిస్తేనేగాని తెలియదు.