Shiv Sena: శివసేనకు మరో ఎదురుదెబ్బ..ద్రౌపది ముర్ముకే సేన ఎంపీల సపోర్ట్
Shiv Sena MP’s Support Droupadi Murmu: మహారాష్ట్రలో శివసేన పార్టీకి వరసగా దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అధికారం కోసం ఆ పార్టీ బీజేపీతో ఉన్న 30 ఏళ్ల బంధాన్ని తెంచుకుని ఎన్సీపీ, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చింది. అయితే, రెండున్నరేళ్ల కాలంలోనే ఆ ప్రభుత్వం కూలిపోయింది. శివసేన పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి వ్యతిరేకం కావడంతో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఇక ఇదిలా ఉంటే, ఈనెల 18 వ తేదీన భారత రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీయే తరపున ద్రౌపది ముర్ము పోటీ చేస్తుండగా, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు.
ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికాయి. ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై శివసేన పార్టీ ఎంపీల సమావేశం ఉద్ధవ్ ఠాక్రే నివాసంలో జరిగింది. ఈ సమావేశానికి 15 మంది ఎంపీలు హాజరయ్యారు. ఇందులో మెజారిటీ ఎంపీలు ద్రౌపది ముర్ముకే మద్దతు ఇవ్వాలని పట్టుబట్టినట్లు ఆ పార్టీ ఎంపీ గజానన్ పేర్కొన్నారు. మెజారిటీ శివసేన ఎంపీలు ద్రౌపది ముర్ముకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించడం ఉద్ధవ్ కు మింగుడు పడని అంశంగా మారింది. శివసేనకు మొత్తం 18 మంది ఎంపీలు ఉండగా, సమావేశానికి 15 మంది మాత్రమే హాజరయ్యారు.