ఢిల్లీ: జహంగీర్ పురలో 144 సెక్షన్
ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతుంది. దేశ రాజధాని నగరంలోని జహంగీర్ పురలో కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. ఎలాంటి హింసాత్మక చర్యలు చోటు చేసుకోండా.. పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే జహంగీర్ పురలో 144 సెక్షన్ విధించారు. అనుమానంతో కన్పించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
నిన్న హనుమాన్ శోభయాత్ర సందర్భంగా చిన్న గొడవ చోటు చేసుకుందన్న పోలీసులు.. హనుమాన్ యాత్ర జహంగీర్ పురలోని మసీద్ దగ్గరకు చేరుకోగానే ఆ గొడవ పెద్దదైందని తెలిపారు. ఆందోళనా కారులు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకోవడంతో పలువురు పోలీసులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హనుమాన్ శోభయాత్రలో ఘర్షణపై కేంద్ర హోం మంత్రి సీరియస్ అయ్యారు. మరోవైపు ఢిల్లీ సీఎం సైతం ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం కేజ్రీవాల్ మాట్లాడారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.