Maharashtra Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో ఆర్ఎస్ఎస్ వైఖరి కూడా ఇదేనా..?
RSS silent in Maharashtra political crisis: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు రెండు హిందుత్వ సంఘాల మధ్య పోటీగా మారింది. ఇక ఈ వివాదంలో కీలక భూమిక పోషించాల్సిన ఆర్ఎస్ఎస్ మాత్రం సైలెంట్ అయింది. ఉద్దవ్ ధాకరే ప్రభుత్వం మీద సొంత పార్టీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యే తిరుగుబాటు వెనుక బీజేపీయే ఉంది అని ప్రధానంగా కాంగ్రెస్,ఎన్సీపీ విమర్షిస్తున్నాయి.కాషాయ జెండాని భుజాన వేసుకుని ముందునుంచి హిందుత్వాన్ని బలంగా నిలబెట్టడంలో కీలక భూమిక పోషించింది నిస్సందేహంగా శివసేన. మొదటి నుంచి హిందుత్వాన్నే నమ్ముకున్న పార్టీ అది. అలాంటి శివసేన ఇప్పుడు చిక్కుల్లో పడింది. అయినా సంఘ్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన కనిపించడం లేదు.
ఏక్ నాథ్ షిండే నాయకత్వంలో తిరుగుబాబు చేసిన ఎమ్మెల్యేలు తమదే అసలైన శివసేన అని వాదిస్తున్నారు. పార్టీ గుర్తు కూడా తమకే కేటాయించాలంటూ గవర్నర్‌ని, ఎన్నికల సంఘాన్ని కూడా కోరబోతున్నారు. షిండే వర్గానికి ఇప్పటికే బీజేపీ నుంచి మంచి ఆఫర్ ఉందని, ఫడ్నవీస్ తిరిగి ముఖ్యమంత్రి అయితే షిండేకి డిప్యూటీ సీఎంతోపాటు, తిరుబాటు ఎమ్మెల్యేలకు అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రం లోనూ కూడా మంచి పదవులు ఇస్తామని కూడా చెబుతున్నట్టు తెలుస్తుంది.
అప్పట్లో ఫడ్నవీస్ నాయకత్వంలో 2019లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే, ఒకే రోజులో ఆ ప్రభుత్వాన్ని కూలదోసి మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ఏర్పడడం ఆర్ఎస్ఎస్ కి నచ్చలేదని అప్పట్లో చర్చ జరిగింది.అయితే, మహా వికాస్ అఘాడి పేరిట సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా తాను ఎప్పుడూ హిందుత్వాన్ని వదులు కోలేదని, హిందుత్వమే తన విధానమని ఉద్దవ్ ధాకరే వివరణ కూడా ఇచ్చుకున్నారు. అప్పటి నుంచి ఉద్దవ్ తో ఆర్ఎస్ఎస్ కాస్త దూరంగా ఉంది. అయితే తాజాగా విడిపోయిన శివసేన,బీజేపీలను కలపాలని అందుకోసమే ఈ మొత్తం వ్యవహారంలో ఆర్ఎస్ఎస్ వ్యూహాత్మక మౌనం పాటిస్తోందని సంఘ్ వర్గాల ద్వారా తెలుస్తుంది. అయితే బాల్ ధాకరే వారసుడిగా ఇంతకాలం కాపాడిన ఉద్దవ్ ధాకరేని సంఘ్ తీసి పక్కన పెట్టబోతోందా అన్నదే ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చగా మారింది.