Republic Day Celebrations in Delhi: ఢిల్లీలో ఘనంగా ప్రారంభమైన రిపబ్లిక్ డే ఉత్సవాలు
Republic Day Celebrations in Delhi: దేశరాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశంలో జరుగుతున్న 74వ గణతంత్ర దినోత్సవ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్వా అల్ సిసి హాజరయ్యారు. ఈరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఇక రిపబ్లిక్ డే వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు టిక్కెట్లను ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తున్నారు. శక్తిపథ్‌లో నిర్వహించనున్న ఈ ఉత్సవాల సీటింగ్ సామర్థ్యాన్ని 1.20 లక్షల నుండి 45 వేలకు కుదించారు.
ఈ ఉత్సవాల్లో మేకిన్ ఇండియా ఆయుధాలు ప్రధాన ఆకర్షణగా మారనున్నాయి. ప్రతి ఏడాది విదేశాల నుండి కొనుగోలు చేసిన ఆయుధాలతోనే పరేడ్ నిర్వహించేవారు. కానీ, ఈ ఏడాది నుండి భారత్‌లో తయారైన మేకిన్ ఇండియా ఆయుధాలను ప్రదర్శించనున్నారు. ఉదయం 10:30 గంటలకు విజయ్ చౌక్ నుండి పరేడ్ ప్రారంభం అవుతుంది. ఎర్రకోట వరకు పరేడ్ కొనసాగుతుంది. ఆ వేడుకల్లో ఆర్మీకి చెందిన నాలుగు బృందాలు, వాయుసేన, నేవీకి చెందిన ఒక్కొక్క బృందం కవాతులో పాల్గొననున్నది.
ఇక జాతీయ గీతం సమయంలో 21 గన్ సెల్యూట్స్ కోసం సంప్రదాయంగా వినియోగిస్తున్న బ్రిటీష్ పౌండర్స్ గన్స్ స్థానంలో 105 ఎంఎం ఇండియన్ ఫీల్డ్ గన్స్ తో సెల్యూట్ చేయనున్నారు. ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో ఈజిప్ట్ నుండి వచ్చిన 120 మంది సైనికులు కూడా కవాతు చేయనున్నారు. ఈ వేడుకల్లో అగ్నీవీర్‌లు కూడా పాల్గొననున్నారు. అదేవిధంగా ఆర్మీ సిగ్నల్ కోర్, ఎయిర్ డిఫెన్స్, ఆర్మీ డేర్ డెవిల్స్ విభాగాలకు చెందిన మహిళలు కూడా మార్చ్‌లో పాల్గొననున్నాను. నారిశక్తి ప్రదర్శనలో నేవీకి చెందిన 144 సెయిలర్ విభాగానికి చెందిన మహిళా అధికారిణులు మార్చ్‌లో పాల్గొననున్నారు. ఇక, 48ఏళ్లుగా నౌకా దళానికి సేవలు అందిస్తున్న ఐఎస్ 38 విమానం చివరిసారిగా ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొననున్నది. ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో 44 త్రివిధ దళాల విమానాలు, 9 రఫేల్ యుద్ధ విమానాలు, దేశీయంగా తయారైన అటాక్ ప్రచండ హెలికాఫ్టర్లు కూడా పాల్గొననున్నాయి.