Rajasthan Assembly Elections 2023: ఎన్నికలకు ముందే రాజస్థాన్‌లో లొల్లి… సిట్టింగులకు సీట్లు కష్టమే
Rajasthan Assembly Elections 2023: ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే, కాంగ్రెస్ అధికారంలో ఉన్న చత్తీస్‌గడ్, రాజస్థాన్ రాష్ట్రాలపైనే అందరి దృష్టి ఉన్నది. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. పెద్ద రాష్ట్రమైన రాజస్థాన్‌లో గత కొన్ని సంవత్సరాలుగా సంప్రదాయం కొనసాగుతున్నది.
ఒకవిడత కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే, మరోవడత బీజేపీకి అవకాశం ఇస్తున్నారు. 2018 డిసెంబర్ 7 వ తేదీన ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీకి అక్కడి ప్రజలు అధికారం అప్పగించారు. అంతకు ముందు బీజేపీ అధికారంలో ఉన్నది. మొత్తం 200 స్థానాలున్న రాజస్థాన్ లో అధికారం చేజిక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 101 ఉండాలి. కాగా, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించగా, మిత్రపక్షాలతో కలిపి మొత్తం ఆ పార్టీకి బలం 122కి చేరింది.
ఆ ఎన్నికల్లో బీజేపీ 72 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా మధ్యలో ఒకమారు అధికారం కోల్పోయే దిశగా అడుగులు వేసినా, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సమయోచితంగా ఎమ్మెల్యేలను తనకు అనుకూలంగా మార్చుకోవడంతో అధికారం కోల్పోకుండా కాపాడుకోగలిగారు. ఆ తరువాత అశోక్ గెహ్లాట్ ను ఏఐసీసీ అధ్యక్షుడిగా నియమించాలని హైకమాండ్ నిర్ణయించింది. ఒకరికి ఒక పదవి మాత్రమేననే కాంగ్రెస్ పార్టీ నినాదం కారణంగా, ఆయన పార్టీ అధ్యక్షుడికంటే, ముఖ్యమంత్రిగా ఉండటమే బెటరని అనుకున్నారు.
పార్టీ అధ్యక్ష ఎన్నికల బరి నుండి తప్పుకోవడంతో, పార్టీ హైకమాండ్ ఆ పదవిని మల్లిఖార్జున ఖర్గేకు అప్పగించింది. హైకమాండ్‌ను దిక్కరించి, అధ్యక్ష పదవిని తీసుకోకుండా నిరాకరించడంతో ఆయనపై పార్టీ ఆగ్రహంగా ఉన్నది. ఒకవేళ అశోక్ గెహ్లాట్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తే, సీఎం పదవిని కోల్పోవలసి వస్తుంది. ఆ సీటు కోసం చాలా కాలంగా సచిన్ పైలట్ ఎదురు చూస్తున్నాడు. ఒకానొక సమయంలో గెహ్లాట్‌పై సచిన్ పైలట్ తిరుగుబాటు కూడా చేశారు. కానీ, అశోక్ గెహ్లాట్ సమయస్పూర్తితో ప్రమాదాన్ని తప్పించాడు.
హైకమాండ్ కూడా అశోక్ ను తప్పిస్తే, ఆ సీటును సచిన్‌కు కేటాయించాలని అనుకున్నది. కానీ, కుదరకపోవడం, ఒకవేళ బలవంతంగా అశోక్ గెహ్లాట్‌ను తప్పిస్తే, రాజస్థాన్‌లో కూడా అధికారాన్ని కోల్పోవలసి వస్తుందేమోనని సందేహించింది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అశోక్ గెహ్లాట్ వర్గీయులకు సీట్లు కేటాయించే విషయంపై కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్నది. గెహ్లాట్ వర్గీయులకు సీట్లు ఇవ్వడం వలన హైకమాండ్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని, అందుకే సిట్టింగ్‌లకు టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉండబోదని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
సర్వేల పేరుతో సిట్టింగ్‌లకు టిక్కెట్లు ఇవ్వకుండా కొత్తవారికి ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఇదే నిజమైతే రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ గొడవ తప్పేలా లేదు. ఒకవేళ ఓటర్లు గతంలో మాదిరిగానే సంప్రదాయానికే మొగ్గుచూపితే అధికారం చేతులు మారుతుంది. లేదా, ఓటర్లు సంప్రదాయానికి విరుద్దంగా ఓటు వేయాలని అనుకున్నా సిట్టింగ్‌లకు సీట్లు దక్కే అవకాశాలు లేకపోవడంతో ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారన్నది ఆసక్తికరం.