Rahul Gandhi on BJP : పప్పుగా చూపేందుకు వేల కోట్లు ఖర్చు
Rahul Gandhi on BJP and RSS: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లో కొనసాగుతున్నది. చలిని లెక్కచేయకుండా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రలో కాంగ్రెస్ శ్రేణులతో పాటు జమ్మూకాశ్మీర్‌లోని వివిధ పార్టీల నేతలకు కూడా పాల్గొంటున్నారు. యువత నుండి కూడా పెద్ద ఎత్తున మద్ధతు లభిస్తున్నది. ఈ నెల 30వ తేదీతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగియనున్నది. శ్రీనగర్‌లో జరిగే భారీ బహిరంగ సభతో యాత్రను ముగిస్తున్నారు.
కాగా, రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తనను చేతగానివాడిగా, పప్పుగా చూపించేందుకు కాషాయ పార్టీలు కాళ్లకు కంకణం కట్టుకొని ప్రచారం చేశాయని విమర్శించారు. సోషల్ మీడియాలో తనను పప్పుగా చూపించేందుకు వేల కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. అభివృద్ధిని పక్కన పెట్టి తనను తప్పుగా చూపేందుకు ఎక్కువ మొత్తంలో ఖర్చుచేసినట్లు రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాలను తాను తప్పని నిరూపించానని అన్నారు. భారతదేశం సత్య దేశమని, సత్యమే గెలుస్తుందని అన్నారు. డబ్బు, అధికారం, గర్వం ఎన్నటికీ పనిచేయవని, త్వరలోనే బీజేపీకి ప్రజలు ఓటుతో బుద్ది చెబుతారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తానని రాహుల్ గాంధీ జమ్మూకాశ్మీర్ పాదయాత్రలో పేర్కొన్నారు.