కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి భగ్గుమన్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చైనా (China), భారత భూభాగాన్ని ఆక్రమించలేదని ప్రధాని మోడీ (PM Modi) చెప్పడం పచ్చి అబద్ధమని మండిపడ్డారు.
Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి భగ్గుమన్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చైనా (China), భారత భూభాగాన్ని ఆక్రమించలేదని ప్రధాని మోడీ (PM Modi) చెప్పడం పచ్చి అబద్ధమని మండిపడ్డారు. చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందని స్పష్టం చేశారు. కార్గిల్‌లో (Kargil) నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ఆ తర్వాత ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ముందుగా కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఆ తర్వాత అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. లడఖ్ ఒక వ్యూహాత్మక ప్రాంతమని.. ఇక్కడ వేల కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని చైనా లాక్కుందన్న విషయం స్పష్టమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కానీ ప్రతిపక్షాల సమావేశంలో లడఖ్‌లో ఒక అంగుళం కూడా చైనా ఆక్రమించలేదని మోడీ చెప్పడం బాధకరమని.. పచ్చి అబద్ధమని రాహుల్ వెల్లడించారు.
ఆ తర్వాత తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేశానని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో వ్యాపింపజేస్తున్న హింస, విద్వేషాలకు వ్యతిరేకంగా నిలవడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగిందని పేర్కొన్నారు. ప్రజల మనసులోని మాట వినేందుకు ఆ యాత్ర చేపట్టానని వెల్లడించారు. మరోవైపు రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో యాత్రకు సిద్ధమవుతున్నారు. గాంధీ పుట్టిన నేల నుంచి, ఆయన జయంతి రోజునే అంటే అక్టోబర్ 2 నుంచి రెండో విడత భారత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. గుజరాత్‌లోని పోరుబందర్ నుంచి మేఘాలయ వరకు ఈ యాత్ర కొనసాగుతుందని వివరించాయి.