ఇండియా కూటమి తరుపున ప్రధానమంత్రి అభ్యర్థిని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) ప్రకటించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీనేనని (Rahul Gandhi) అశోక్ గెహ్లాట్ వెల్లడించారు.
Ashok Gehlot: బీజేపీని (BJP) గద్దెదించే ప్రయత్నాలను ఇండియా కూటమి (INDIA Alliance) వేగవంతం చేసింది. క్రమక్రమంగా ప్రతిపక్ష పార్టీలనన్నింటిని కూటమిలో చేర్చుకుంటుంది. ఈక్రమంలో ఇండియా కూటమి తరుపున ప్రధానమంత్రి అభ్యర్థిని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) ప్రకటించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీనేనని (Rahul Gandhi) అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. ఇండియా కూటమిలోని 26 పార్టీలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ గురించి మాట్లాడుతూ అశోక్ గెహ్లాట్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 2014లో ప్రధాని పదవిని చేపట్టినప్పటి నుంచి మోడీ అహంకారపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నారని భగ్గుమన్నారు. మోడీ అలా ఉండకూడదన్న అశోక్ గెహ్లాట్.. కేవలం 31 శాతం ఓట్లతోనే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు. మిగిలిన 69 శాతం ప్రజలు మోడీ సర్కార్కు వ్యతిరేకంగా ఉన్నారని వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపొంది.. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మోడీ చెబుతున్నారన్న అశోక్ గెహ్లాట్.. అది ఎప్పటికీ జరగదని వెల్లడించారు. 50 శాతం ఓట్లతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మోడీ చెప్పడం వింతగా ఉందన్నారు. జనాదరణ ఉన్నప్పుడే 50 శాతం ఓట్లు పడలేదని.. ఇప్పుడు అది ఎలా సాధ్యమవుతుందని అశోక్ గెహ్లాట్ ప్రశ్నించారు. ప్రతి ఎన్నికల్లోనూ స్థానిక అంశాలు ఉంటాయని.. ఆయా ప్రాంతాల్లోని ప్రత్యేక పరిస్థితులు దేశంలోని అన్ని పార్టీలపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాయని వెల్లడించారు. దాని ఫలితంగానే ఇండియా కూటమి ఏర్పడిందని అశోక్ గెహ్లాట్ వెల్లడించారు.