Rahul gandhi: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) 32వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు దేశవ్యాప్తంగా నివాళులర్పిస్తున్నారు.
Rahul gandhi: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) 32వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు దేశవ్యాప్తంగా నివాళులర్పిస్తున్నారు. ఈరోజు ఉదయం సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul gandhi), ప్రియాంక గాంధీలు (Priyanka Gandhi) ఢిల్లీలోని వీర్భూమికి వెళ్లి.. రాజీవ్ గాంధీ సమాధి వద్ద పుష్ఫగుఛ్చాలు ఉంచి నివాళులర్పించారు. అలాగే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు.. దేశవ్యాప్తంగా అన్ని కాంగ్రెస్ కార్యాలయాల్లో నేతలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక తన తండ్రి వర్థంతి సందర్భంగా రాహుల్ గాంధీ ట్విట్టర్లో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. తన తండ్రి జ్ఞాపకాలతో కూడిన వీడియోను షేర్ చేస్తూ.. ‘‘నాన్నా.. ఒక ప్రేరణ రూపంలో, జ్ఞాపకాలుగా మీరు సదా నాతోనే ఉన్నారు’’ అంటూ రాసుకొచ్చారు.
ఇకపోతే 1944లో జన్మించిన రాజీవ్ గాంధీ.. తన తల్లి ఇందిరా గాంధీ మరణం తర్వాత 40 ఏళ్ల వయస్సులో 1984 అక్టోబర్లో భారత ప్రధానిగా పదవిని చేపట్టారు. 40 ఏళ్ల వయస్సులోనే ప్రధాని పదవి చేపట్టి రాజీవ్ గాంధీ రికార్డ్ సృష్టించారు. అయితే, 1991 మే 21న తమిళ నాడులోని శ్రీపెరుంబుదూరులో పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో ఉగ్రసంస్థ ఎల్టీటీఈ చేసిన సూసైడ్ బాంబర్ దాడిలో రాజీవ్ గాంధీ మరణించారు.