RaGa Interrogation: రేపు కూడా విచారణకు రావాలి: రాహుల్‌కు ఈడీ సమన్లు
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీని గత కొన్ని రోజులుగా విచారిస్తున్న ఈడీ రేపు కూడా విచారణకు రావాలని సూచించింది.
నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపిస్తున్న యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఆర్ధిక అవకతవకలు జరిగాయా లేదా అనే కోణంలో ఈడీ విచారణ చేపడుతోంది. రాహుల్ గాంధీని కొన్ని రోజులుగా విచారిస్తోంది. ప్రశ్నలతో కూడిన పత్రాలను అందించి…లిఖిత పూర్వక సమాధానాలు రాబడుతోంది. జూన్ 17న జరగాల్సిన విచారణ జూన్ 20కి వాయిదా పడింది. తన తల్లి సోనియాగాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని..శుక్రవారం తనతో పాటు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ ఈడీకి వివరించడంతో నాల్గవ రోజు విచారణ వాయిదా పడింది.
గత వారంలో 30 గంటల పాటు విచారణ
గత వారంలో రాహుల్ గాంధీ వరుసగా మూడు రోజుల పాటు ఈడీ విచారణకు హాజరయ్యారు. సోమవారం నుంచి బుధవారం వరకు 30 గంటల పాటు అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నలు వేశారు. రాహుల్ నుంచి సమాధానాలు రాబట్టారు. ఈ రోజు కూడా దాదాపు 10 గంటల పాటు విచారించారు. రేపు కూడా విచారణకు రావాలని సూచించారు.
23న హాజరు కావాలని సోనియాకు సమన్లు
రాహుల్ గాంధీతో పాటు సోనియాగాంధీని కూడా ఈడీ అధికారులు విచారించనున్నారు. జూన్ 23న తమ ఎదుట హాజరు కావాలని సోనియాకు ఇప్పటికే సమన్లు జారీ చేశారు.
మెరుగుపడిన సోనియా ఆరోగ్యం
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత వారం రోజులుగా గంగారాం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నఆమె ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడింది. జూన్ 12న పోస్టు కోవిడ్ సమస్యలతో ఆసుపత్రిలో సోనియాగాంధీ ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు మెరుగైన వైద్యం అందించడంతో కోలుకున్నారు. అదే విధంగా సోనియా గాంధీ లోయర్ రెస్పిరేటరీ ట్రాక్‌లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆ సమస్యను తొలగించేందుకు కూడా ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.
విచారణ వాయిదా వేయాలని కోరే అవకాశం
సోనియా గాంధీ వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈడీ విచారణకు హాజరుకావడం సాధ్యం కాకపోవచ్చు. దీంతో విచారణ వాయిదా వేయాలని సోనియాగాంధీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.