Rahul Gandhi: పాదయాత్రతో బీజేపీ హవాకి రాహుల్ గాంధీ చెక్ పెడతారా..?
Rahul Gandhi Bharat Jodo Yathra: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఎప్పుడూ చూడని ఘోరమైన స్ధితిలో పడిపోయింది. మరో వైపు ప్రధాని మోడీ,అమిత్ షాల జోడీ బీజేపీని ఒంటి చేత్తో నడిపిస్తూ 2014 కంటే 2019లో పార్టీని మరింత బలోపేతం చేశారు. అదే ఊపులో బీజేపీ జాడ లేని రాష్ట్రాల్ని సైతం కైవసం చేసుకుంటున్నారు. ఇంకో వైపు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్ధాయి అధ్యక్ష బాధ్యతల్ని కూడా తీసుకోవడానికి నిరాకరిస్తూ, బాధ్యతల నుంచి పారిపోతున్న వ్యక్తి రాహుల్ గాంధీ అని ప్రత్యర్ధి పార్టీలు విమర్షిస్తున్నాయి. ఈ సమయంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3 వేల 600 కిలో మీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు రాహుల్ గాంధీ.
అక్టోబర్ 2న కన్యాకుమారి నుంచి ప్రారంభం కాబోతున్న ఈ యాత్ర దాదాపు 148 రోజుల పాటు 12 రాష్ట్రాల మీదుగా, 203 నియోజకవర్గాల్ని కవర్ చేస్తూ కాశ్మీర్ లో ముగియబోతోంది. పార్టీని బలోపేతం చేయాలంటే ఈ పాదయాత్రే మార్గమని కాంగ్రెస్ అగ్రనాయకులంతా ఢిల్లీలో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. దేశంలో స్వతంత్రగా పనిచేయాల్సిన రాజ్యంగబద్ధమైన వ్యవస్ధలన్నింటినీ, మోడీ సర్కార్ తమ చెప్పుచేతల్లో ఉంచుకుని వాటిని స్వప్రయోజనాల కోసం, ప్రత్యర్ధి పార్టీల్ని ఇబ్బంది పెట్టడం కోసం మాత్రమే వినియోగిస్తున్నాయి అన్నది కాంగ్రెస్ ఈ పాదయాత్రలో ప్రధానంగా చేయబోయే ప్రచారంగా తెలుస్తుంది. దీంతో పాటు ఆర్ఎస్ఎస్ భావజాలంతో ప్రజల్ని మతం పేరిట విభజించి ఏకీకృతం చేయడం ద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నదే మోడీ ప్రయత్నమని, కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ అంశాలే ప్రధానంగా తీసుకుని ఈ భారత్ జోడో పాదయాత్రలో ప్రజలకు వివరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రాహుల్ గాంధీ.
ఈ యాత్ర ఆలోచన కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైనప్పటికీ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు రాహుల్ హాజరుకావాల్సి ఉండడంతో కొంత జాప్యం జరిగింది. ఈ యాత్రని అడ్డుకోవడానికే ఈడీ విచారణ అస్త్రాన్ని బీజేపీ వాడింది అని కాంగ్రెస్ శ్రేణుల ఆరోపించాయి. కొద్ది రోజుల ఆలస్యంతోనైనా మొదలవుతున్న ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. దీనికి తోడు గాంధీ కుటుంబం నుంచి కాంగ్రెస్‌ని బయటకు తీసుకురావాలని కొంత మంది సీనియర్లు వేరుకుంపటి పెడుతుంటే, మరికొంత మంది వీరవిధేయులు గాంధీ కుటుంబమే మళ్ళీ పార్టీకి పూర్వవైభవం తీసుకు వస్తుందని బలంగా నమ్ముతున్నారు. ఇలా సమస్యల సుడిగుండంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఈ ఒక్క పాదయాత్ర ఒడ్డుకు చేరుస్తుందా అన్నది చూడాల్సి ఉంది.