Rahul Gandhi-ED: ‘ఆలిండియా’ను ఆశ్చర్యపర్చిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు
Rahul Gandhi investigation protests: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఐదో రోజు (జూన్ 22న) కూడా విచారణ జరిపింది. దీంతో ఈడీ వ్యవహార శైలిని తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిరసన వ్యక్తం చేసింది. ఈ ఆందోళన రణరంగాన్ని తలపించింది. కాంగ్రెస్ పార్టీ నేతలకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిట్టా డిసౌజా పోలీసులపైకి ఉమ్మి వేశారు. ఈ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, నేతలు ఏఐసీసీ ఆఫీసు నుంచి జంతర్ మంతర్ వరకు ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. అప్పుడు తోపులాట జరిగింది. ఇందులో కొందరు నేతలు కిందపడిపోయారు. ఢిల్లీ కాంగ్రెస్ మహిళా నేత అల్కా లాంబా పోలీసులతో గొడవ పెట్టుకున్నారు. వాళ్లు తనను కొట్టారని ఆరోపించారు. ఆ సమయంలో ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అయినా పోలీసులు వెనక్కి తగ్గలేదు. అల్కా లాంబాను బలవంతంగా వ్యాన్ లోకి ఎక్కించారు. మరికొంత మంది లీడర్లను లాక్కొని వెళ్లారు.
అధిర్ రంజన్ సహా పలువురు ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు సాకుతో కేంద్రం ఈడీని అడ్డంపెట్టుకొని రాహుల్ గాంధీని వేధిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రాల నుంచి పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకోవాలని పిలిచినట్లు సమాచారం. ఎంపీలు ఇప్పటికే హస్తినలో ఉన్నారు. ఇవాళ సోనియాగాంధీ కూడా ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది.