Rahul Gandhi: అక్టోబర్ 2 నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తమ పార్టీకి పునర్ వైభవం తీసుకువచ్చే పనిలో పడ్డారు. ప్రజలను నేరుగా కలిసేందుకు సమాయత్తం అవుతున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో జరిగే ఈ కార్యక్రమం 148 రోజుల పాటు జరగనుంది. ప్రతి రోజు రాహుల్ గాంధీ 25 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. మొత్తంగా 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు. అక్టోబర్ 2 నుంచి రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ జోడో పాదయాత్ర ప్రారంభం కానుంది.
పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు జరిగిన కీలక సమావేశం అనంతరం భారత్ జోడో పాదయాత్ర గురించి నాయకులు వివరించారు. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి పీసీసీ అధ్యక్షులు, పార్టీ జనరల్ సెక్రటరీలు, కీలక నాయకులు హాజరయ్యారు. రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటన నిమిత్తం విదేశీ పర్యటనలో ఉన్నారు. పార్లమెంటు సమావేశాల ముందు భారత్ చేరుకోనున్నారు.
ఉదయ్ పూర్ సభలో సోనియా వ్యాఖ్యలు
మే నెలలో కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ ఏర్పాటు చేసింది. ఆ సమావేశాల్లో అనేక కీలక విషయాలను చర్చించారు. రాజస్థాన్‌లో ఉదయ్పుర్లో జరిగిన ఈ సమావేశాల్లో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ భారత్ జోడో నినాదాన్ని వాడారు. బీజేపీకి చెక్‌పెట్టడానికి ఉపయోగించవలసిన తారక మంత్రాన్ని ఆ నాడే అధినేత్రి కార్యకర్తలకు ఉద్భోదించారు. భారత్ జోడీ కార్యక్రమం ద్వారా పాదయాత్రలతో పాటు ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనగా, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీలు, ఇతర కీలక నాయకులు బహిరంగ సభలు చేపట్టనున్నారు.