PT Usha: కంటతడి పెట్టిన పీటీ ఉష.. అసలు ఏమైందంటే?
PT Usha: కేరళలోని తన అకాడమీలో వేధింపులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని, అకాడమీ స్థలంలో ఆక్రమణలు జరిగాయని ప్రముఖ అథ్లెట్, భారత ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు పీటీ ఉష కంటతడి పెట్టారు. ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీటీ ఉష మాట్లాడుతూ.. గతేడాది రాజ్యసభ సభ్యురాలిని అయిన తర్వాత ఈ సమస్య మొదలైందని.. ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ స్థలంలో కొందరు అక్రమార్కులు అక్రమ నిర్మాణ పనులు చేపట్టారని.. అకాడమీ అధికారులు అడ్డుకోవడంతో… వారు దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు. పనంగాడ్ పంచాయతీ నుంచి తమకు అనుమతి ఉందని బిల్డర్లు పేర్కొన్నారని, దీంతో మేము పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఆ తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించడంతో నిర్మాణం ఆగిపోయిందిమ, అయినా సమస్య పరిష్కారం కాలేదని ఆమె అన్నారు.
ఇక ఆ విషయాన్ని గుర్తు చేస్తూ, “కొందరు తాగుబోతు వ్యక్తులు రాత్రిపూట ఇబ్బందులు సృష్టిస్తున్నారని, చాలా మంది స్థానిక నివాసితులు అకాడమీలోని కాలువలలో చెత్తను వేస్తూ మమ్మల్ని నిరంతరం వేధిస్తున్నారని అన్నారు. మా అకాడమీలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారని వారి భద్రత కోసం మేము సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి మేము కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను సహాయం కోరుతున్నామని ఆమె అన్నారు. కేరళలోని బలుసెరీలో ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్‌ను 2002లో ఆమె ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది అథ్లెట్స్ కు ఆమె శిక్షణ ఇస్తున్నారు. భారతదేశానికి ఒలంపిక్స్‌లో మరిన్ని పతాకాల తెచ్చేలా వారికి తర్ఫీదు ఇస్తున్న క్రమంలో ఉష వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక ఈ అంశం మీద కేరళ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.