Presidential Elections: రాష్ట్రపతి ఎన్నికల ఉత్కంఠతకు నేటితో తెరపడనుందా..?
16వ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడి ఐదురోజులు అయింది. ఇప్పటికే అనేక మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, అధికార, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి అభ్యర్థులను ఇప్పటి వరకు ప్రకటించలేదు. దీంతో ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భారత రాష్ట్రపతి ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే అధిష్టానం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు ఈ కమిటీ ఇప్పటికే వివిధ ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరిపింది. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది.
మైసూర్ లో జరుగుతున్న అంతర్జాతీయ యోగా డే దినోత్సవం ప్రధాని మోడీ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ముగించుకొని ఢిల్లీ వచ్చిన తరువాత బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ బోర్డు సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అధికార పార్టీ రాష్ట్రపతి అభ్యర్ధిని ప్రకటించిన తరువాతే ప్రతిపక్షాలు వారి అభ్యర్ధిని ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అనేదాని పై క్లారిటీ రానున్నది. రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ కు చివరి తేదీ జూన్ 29కాగా, జూన్ 30 వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ కు జులై 2 వ తేదీ వరకు గడువు ఉంటుంది. జులై 18వ తేదీన ఎన్నికలు, జులై 21న ఫలితాలు వెలువడతాయి.