Presidential Elction:రాష్ట్రపతి ఎన్నికలకు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి లింక్ ఉందా..?
మహారాష్ట్రలో రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. మహా వికాస్ అఘాడీ సర్కారులో రేగిన అలజడితో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్నట్లు జోరుగా చర్చలు సాగుతున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో కీలక పాత్ర పోషించిన ఎన్సీపీ ప్రెసిడెంట్ శరద్‌పవార్‌తో పాటు శివసేన అధినేతను ఇరుకున పెట్టే వ్యూహంలో భాగంగానే బీజేపీ ఈ కొత్త సంక్షోభాన్ని తెర పైకి తెచ్చిందా అన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతుంది.
రాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండే, తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి క్యాంప్‌పెట్టడం మహరాష్ట్ర సర్కార్‌ను ఒక్కసారిగా ఇరుకున పెట్టింది. షిండే తన మద్దతుదారులతో కలిసి బీజేపీ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురు చూస్తున్న బీజేపీ అదును చూసి సంకీర్ణ సర్కార్ ని దెబ్బకొట్టింది. తన దగ్గర 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఉద్దవ్ ఠాక్రే బీజేపీతో పొత్తుకు సిద్ధమైతే పార్టీలో చీలిక ఉండదని ఏక్‌నాథ్ షిండే సూరత్ మీటింగ్‌లో చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ పరిణామాలు రాష్ట్రపతి ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతాయనే చర్చ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్,ఎన్సీపీ,శివసేన ఇప్పుడు మహరాష్ట్ర సంక్షోభం పైనే దృష్టి పెట్టడంతో బీజేపీ రాష్ట్రపతి ఎన్నికల పై మరిత ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.
అవకాశం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోన్న బీజేపీ ఇప్పుడిక ఆపరేషన్ ఆకర్ష్‌కు రంగం సిద్దం చేసింది. ఇప్పటికే సూరత్ హోటల్‌లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో అమిత్‌షా సమావేశం కావడం కూడా పొలిటికల్ హీట్ పెంచింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌కు కలిపి 152 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. శివసేనకు 55 సీట్లు, ఎన్సీపీకి 53, కాంగ్రెస్‌కు 44, బీజేపీకి 106 సీట్లు ఉన్నాయి. శివసేనకు చెందిన 34 మంది ఎమ్మెల్యేలతోపాటు ఒక ఇండిపెండెంట్ సూరత్ హోటల్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ఈ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే మహా వికాస్ అఘాడి సర్కార్ కూలిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే మెజారిటీ మార్కు కంటే ఎక్కువగా తమకు 135 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బీజేపీ వాదిస్తోంది.