Presidential election: రాష్ట్రపతి ఎన్నిక..ఎలక్టోరల్ కాలేజీ ఓటింగ్ విధివిధానాలు ఇవే..!
Presidential election procedures:
ప్రధానమంత్రిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటే, రాష్ట్రపతిని పరోక్షంగా ఎన్నుకుంటారు. ప్రజలు ప్రజాప్రతినిధులను గెలిపిస్తే, ఆ ప్రజాప్రతినిధులు ఓటు వేసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతి అభ్యర్థి తప్పనిసరిగా భారత పౌరుడు అయి ఉండి, 35 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలన్నది నిబంధన. రాష్ట్రపతి పదవికి పోటీపడాలనుకువారికి నామినేషన్లతో ప్రక్రియ మొదలవుతుంది. నామినేషన్ పత్రాలు ఢిల్లీలో మాత్రమే ఇస్తారు. అభ్యర్థుల నామినేషన్‌ను తప్పనిసరిగా ఎలక్టోరల్ కాలేజీలోని 50 మంది ప్రతిపాదించాల్సి వుంటుంది. మరో 50 మంది బలపరచాలి. 15 వేల రూపాయలను డిపాజిట్ చెయ్యాలి.
రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాలు, ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికైన శాసనసభ సభ్యులుంటారు. వీరంతా ఓటు హక్కు ద్వారా ప్రెసిడెంట్ ను ఎన్నుకొంటారు. రాజ్యసభ, లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లోని నామినేటెడ్ సభ్యులు, రాష్ట్రాల శాసనమండలి సభ్యులు ఎలక్టోరల్ కాలేజీలో ఉండరు. అందుకే వాళ్లకి ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండదు. ఓటింగ్ బ్యాలెట్ పేపర్ విధానంలో జరుగుతుంది.
ఓటింగ్ సమయంలో వాడే పెన్నును కేంద్ర ఎన్నికల సంఘమే అందిస్తుంది. ఆ పెన్నుతోనే ఓటేయ్యాలి. వేరే పెన్నుతో వేస్తే ఆ ఓటు చెల్లుబాటు కాదు. ఓటు చెల్లుబాటు కావాలంటే తొలి ప్రాధాన్యత సంఖ్యను తప్పనిసరిగా మార్క్ చేయాలి. ప్రథమ ప్రాధాన్యత సంఖ్య వేయకుండా, ఇతర ప్రాధాన్యత నంబర్లు వేస్తే ఆ ఓటు రద్దు అవుతుంది. ఓటింగ్‌లో పాల్గొనేవారు రహస్య ఓటింగ్ తప్పకుండా పాటించాల్సి వుంటుంది. బ్యాలెట్‌ను ఎవరికైనా చూపితే ఆ ఓటు చెల్లదు. రాష్ట్రపతి ఎన్నికకు పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్ జారీచేయకూడదు. ఓటేయడానికి, గైర్హాజరు కావడానికి ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ ఉంటుంది.
ఎంపీలు పార్లమెంటులో ఓటు వేస్తారు. ఎమ్మెల్యేలు వారి అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకుంటారు. అనారోగ్యం లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రం, మరెక్కడైనా ఓటు వేసేందుకు అనుమతి కోరాలి. కనీసం పది రోజులు ముందుగా కమిషన్ పర్మిషన్ పొందాలి. బ్యాలెట్ బాక్సులు ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధానులకు వెళ్తాయి. ఓటింగ్ అనంతరం వాటిని తిరిగి ఢిల్లీకి తరలిస్తారు. రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఓట్లు లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. పోలయిన మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో 50 శాతం +1, మొదటి ప్రాధాన్యత ఓట్లను సాధించిన అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు ఎన్నికల అధికారులు.