Republic Day Celebrations: అట్టహాసంగా గణతంత్ర వేడుకలు..
Republic Day Celebrations at Delhi Kartavya Path: దేశ రాజధాని దిల్లీలో 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్‌పథ్ పేరు మార్చి ఆధునీకరించిన తర్వాత తొలిసారి గణతంత్ర వేడుకలకు కర్తవ్య పథ్ వేదికైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ గీతం ఆలపించిన అనంతరం 21 గన్ సెల్యూట్ స్వీకరించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా హాజరయ్యారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని నరేంద్రమోడీ, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈసారి ఈజిప్ట్ కు చెందిన సైనిక దళాలు పరేడ్ లో పాల్గొన్నాయి.
గణతంత్ర వేడుకల్లో ఈసారి సామాన్యులకు పెద్దపీట వేశారు. రిక్షాకార్మికులు, చిరువ్యాపారులకు పరేడ్ చూసేందుకు అవకాశం కల్పించారు. దేశప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధుల కలలు నిజమవ్వాలంటే కలిసి ముందుకు సాగాలని దేశ ప్రజలకు సందేశమిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. వార్ మెమోరియల్ లో ప్రధాని మోదీ నివాళి అర్పించారు. గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో మకర సంక్రాంతి సందర్భంగా రైతుల పండుగ అయిన ‘ప్రభల తీర్థం’ను వర్ణించే ఆంధ్రప్రదేశ్ శకటం అందరిని ఆకట్టుకుంది. త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.