కర్ణాటక పంచాయితీ దాదాపుగా కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. కర్ణాటకలో అధికారం ఎవరికి కట్టబెట్టాలనే విషయంలో కాంగ్రెస్ పెద్దలు రాజీ ఫార్ములాను సిద్ధం చేశారు. మొదటి మూడేళ్ల పాటు సిద్ధరామయ్య, తర్వాత రెండేళ్ల పాటు డీకే శివకుమార్ సీఎం పదవిని అధిష్టించనున్నారు.
Power Sharing Formula in Karnataka
కర్ణాటక పంచాయితీ దాదాపుగా కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. కర్ణాటకలో అధికారం ఎవరికి కట్టబెట్టాలనే విషయంలో కాంగ్రెస్ పెద్దలు రాజీ ఫార్ములాను సిద్ధం చేశారు. మొదటి మూడేళ్ల పాటు సిద్ధరామయ్య, తర్వాత రెండేళ్ల పాటు డీకే శివకుమార్ సీఎం పదవిని అధిష్టించనున్నారు. ఈ విషయంపై ఇవాళ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ భేటీ కానుంది.
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పంపిన కేంద్ర పరిశీలకులు నిన్న బెంగళూర్‌లో జరిగిన సీఎల్పీ సమావేశంలో పాల్గొని ఎమ్మెల్యే అభిప్రాయాలను సేకరించారు. ఆ నివేదికను నేడు కాంగ్రెస్ చీఫ్‌కు అందించారు. ఆ రిపోర్టు ప్రకారం 84 మంది సిద్ధరామయ్యకు మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. 42 మంది మాత్రమే డీకే శివకుమార్‌వైపు మొగ్గు చూపినట్లు వెల్లడయింది. మిగిలిన ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేసినట్లు కేంద్ర పరిశీలకులు తెలిపారు.
మరోవైపు సిద్ధరామయ్య ఢిల్లీ చేరుకుని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో పాటు మరికొంత మంది సీనియర్ నేతలను కలిశారు. వారితో మంతనాలు జరుపుతున్నారు. డీకే శివకుమార్ మాత్రం తన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని బెంగళూర్లోనే ఉన్నారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్టీ గెలుపుకోసం ఎంతో కష్టపడ్డానని తెలిపారు. సీఎం అభ్యర్ధి విషయంలో అధిష్టానానిదే తుది నిర్ణయం అని స్పష్టం చేశారు. సోనియా, రాహుల్, ఖర్గేలు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు కూడా హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఢిల్లీ బయలుదేరారు.