Maha Political Crisis: మహారాష్ట్రలో కీలక పరిణామాలు
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. రెబల్ ఎమ్మెల్యేల దెబ్బకు మైనార్టీలో పడిన ఉద్ధవ్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. క్యాంపు రాజకీయాలకు పాల్పడిన వారిలో కొందరిని తమవైపు తిప్పకునే ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు ట్రబుల్ షూటర్ శరద్ పవార్ కూడా రంగంలో దిగారు. పరిస్థితి చేదాటిపోకుండా పావులు కదుపుతున్నారు.
మరోవైపు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని రెబల్ ఎమ్మెల్యేలు జోరు పెంచారు. మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్, గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ సెక్రటరీ రాజేంద్ర భగవత్‌లకు తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ఏక్‌నాథ్ షిండేయే తన నాయకుడని స్పష్టం చేస్తూ 37 మంది ఎమ్మెల్యేలు తమ సంతకాలతో కూడిన లేఖలు పంపారు.
అంతకు ముందు శివసేన తమ లెజిస్లేచర్ పార్టీ కొత్త నాయకునిగా అజయ్ చౌదరిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు చేపట్టిన ఏక్‌నాథ్ షిండేను తొలగించింది. తన నిర్ణయాన్ని డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌కు తెలియజేశారు. శివసేన పార్టీ పంపిన నియామక ఉత్తర్వులను పరిశీలించిన జిర్వాల్.. ఆ నియామకాన్ని ఆమోదించారు.
షిండే వర్గం కూడా పలు మార్పులు చేస్తోంది. అసెంబ్లీలో శివసేన పార్టీ చీఫ్ విప్‌గా ఉన్న సురేశ్ ప్రభును తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సురేశ్ ప్రభు స్థానంలో తమ వర్గానికి చెందిన భరత్ గొగావాలేను పార్టీ చీఫ్ విప్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది.
ఆ విషయం నాకు తెలీదే
అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రకి చెందిన ఎమ్మెల్యేలు అసోంలో ఉన్నట్లు తనకు తెలియదని అన్నారు. అసోంలో మంచి మంచి హోటళ్లు అనేకం ఉన్నాయని..దేశంలో ఎవరైనా వచ్చి ఇక్కడ ఉండవచ్చని అన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ హోటళ్లలో ఉండవచ్చని తెలిపారు.