Delhi: ఇటీవల సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిన విషయానికి సంబంధించి విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా ఈ వీడియో చర్చనీయాంశంగా మారుతోంది. జాతీయ మీడియాలో కూడా దీనిపై వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో సీరియస్ అయింది.. ప్రధానమంత్రి కార్యాలయం.. నేరుగా రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలోనే ఇదంతా నడిచినట్లు ఈ కేసులోని నిందితులు చెప్పినట్లుగా ఆడియో, వీడియో రికార్డుల్లో బయటపడటంతో.. పీఎంఓ కార్యాలయం ఆరా తీస్తోంది.
ఇందులో నిజానిజాలను నిగ్గు తేల్చాల్సిందిగా పీఎంలోని ముగ్గురు కీలక అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కేసులోని నిందితులకు కేంద్ర పెద్దలతో ఉన్న సంబంధాలు, నికిలీ ఆధార్ కార్డులు, ఆడియో, వీడియో రికార్డులపై లోతుగా విశ్లేషణ చేపట్టనున్నారని చెబుతున్నారు. ఈ వ్యవహారం పై కేంద్ర దర్యాప్తు సంస్థలతో కూడా విచారణ చేయించే ఆలోచనలో మోదీ సర్కార్ ఉందనే చర్చ జరుగుతోంది.
ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా దీనిపై స్పందించారు. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ప్రతిపక్షాలు బీజేపీని టార్గెట్ చేసే అవకాశముందని తెలుస్తుంది.