Ram nath kovind: నేడు రాష్ట్రపతికి ప్రధాని వీడ్కోలు విందు..పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం..కానీ
PM Narendra Modi To Host Farewell Dinner President Ram Nath Kovind: భారత దేశ రాష్ట్రపతి ఎన్నికలు ఈ నెల 18 వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో అధికార ఎన్డీయే బలపరిచిన అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. ఈనెల 25 వ తేదీన ఆమె రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు. 14 వ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈనెల 24 వ తేదీన పదవి నుంచి తప్పుకొనున్నారు. కాగా, ఈ నెల 23న ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలుకనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఈ కార్యక్రమం జరుగనున్నది. పదవీ విరమణ అనంతరం రాంనాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్‌ను వీడి 12 జన్‌పథ్ రోడ్‌లోని తనకు కేటాయించిన భవనానికి వెళ్లనున్నారు. రాష్ట్రపతికి ప్రధాని మోడీ వీడ్కోలు విందు ఇవ్వనున్నారు.ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు ఢిల్లీలోని అశోక హోటల్లో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా కేంద్ర మంత్రులు, పలువురు అధికారులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దీనికి హాజరు కానున్నారు. దేశంలోని ప్రముఖ నేతలు, మిత్ర, విపక్షాలకు చెందిన నేతలకు ప్రధాని ఆహ్వానాలు పంపారు.
బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీకి కూడా ప్రధాని ఆహ్వానం పంపారు. అయితే, తనకు ఆరోగ్యం బాగాలేదని, ఈ విందుకు హాజరు కాలేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్లు తెలుస్తుంది. ఈ విందు కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత రెండు రోజుల క్రితం వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడినట్లు జనసేన పార్టీ నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 24న నిర్వహించాల్సిన జనవాణి కార్యక్రమాన్ని సైతం ఆయన వాయిదా వేసుకున్నారు.