PM Modi’s Roadshow: ప్రధాని మోడీ కాన్వాయ్ లో భద్రతా లోపం.. ఏమైందంటే?
Security Breach At PM Modi’s Roadshow: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏర్పాటు చేసిన భద్రత లో లోపం కర్ణాటకలో వెలుగు చూసింది. ప్రధాన మంత్రి మోడీ ప్రస్తుతం కర్ణాటకలోని హుబ్లీలో రోడ్‌షో చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు ప్రధాని మోదీ భద్రతా వలయాన్ని ఛేదించి కారు దగ్గరకు చేరుకున్నాడు. దీంతో ప్రధాని భద్రత గురించి అనేక అంశాలు తెరమీదకు వచ్చాయి. ఈ క్రమంలో హుబ్లీ పోలీసు కమిషనర్ ఎలాంటి భద్రతా ఉల్లంఘనా జరగలేదని అన్నారు. ప్రధాని భద్రతలో ఎలాంటి లోపం లేదని ఆయన అంటున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం, రోడ్‌షో సమయంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా మోడీ వాహనం దగ్గరకు చేరుకున్నాడు. ఆ వ్యక్తి ప్రధాని మోదీకి పూలమాల వేయాలనుకున్నాడు.
అయితే, ప్రధాని వద్దకు వస్తున్న వ్యక్తిని చూసిన భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి అతడిని మధ్యలోనే ఆపారు. వెంటనే ఆయనను ప్రధాని కాన్వాయ్ నుంచి దూరం తీసుకెళ్లారు. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రైల్వే స్పోర్ట్స్ గ్రౌండ్‌లో జాతీయ యువజనోత్సవాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రతిభావంతులైన యువతను దేశ నిర్మాణం వైపు ప్రోత్సహించడంతోపాటు జాతీయ స్థాయిలో యువతను ముందుకు తీసుకురావడానికి ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 30,000 మందికి పైగా యువత ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా, అక్కడ ప్రధాన మంత్రి తన విజన్‌ని వారితో పంచుకుంటారు. ఐదు రోజుల జరగనున్న ఈ ఈవెంట్‌లో, భారతదేశం అంతటా 7,500 మంది యువ ప్రతినిధులు ఈ వేడుకలో భాగమవనున్నారు.