PM Modi: సంస్కరణలు మొదట్లో ఇబ్బందిగానే ఉంటాయి..అగ్నిపథ్ స్కీమ్‌పై మోడీ పరోక్ష వ్యాఖ్యలు
అగ్నిపథ్ స్కీమ్ విషయమై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. సంస్కరణలు అనేవి మొదట్లో ఇబ్బందిగానే ఉంటాయని..దీక్షకాలంలో ఎంతో మేలు చేస్తాయని అగ్నిపథ్ నియామక ప్రక్రియపై పరోక్షంగా స్పందించారు.
కాలం గడిచేకొద్దీ సంస్కరణల వల్ల దేశానికి లాభం జరుగుతుందని ప్రధాని మోడీ అన్నారు. బెంగళూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార దాహం కలిగిన కొందరు నేతలు..ప్రైవేటు రంగాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని విమర్శించారు.
బెంగళూరులో రూ.280 కోట్లతో నిర్మించిన మెదడు పరిశోధనా కేంద్రాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. అదే విధంగా రూ.28వేల కోట్లతో చేపట్టిన రహదారి, రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజక్టులకు శ్రీకారం చుట్టారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్‌కు బెంగళూరు నగరం ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని ప్రశంసలు కురిపించారు.
సంస్కరణల ద్వారానే కొత్త కొత్త టార్గెట్లను అందుకోగలమని ప్రధాని అన్నారు. భారత యువతకు బెంగళూర్ నగరం డ్రీమ్ సిటీ అని మోడీ ప్రశంసించారు. ఈ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు ఈజ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ లివింగ్‌కు దోహదపడతాయని అన్నారు.
బెంగళూర్ నగరానికి సబర్బన్ రైల్వే ప్రాజెక్టు గతంలోనే వచ్చి ఉంటే మరింత అభివృద్ధి జరిగి ఉండేదని అన్నారు. ఈ ప్రాజెక్టు ఇప్పటికే 40 ఏళ్ల పాటు ఆలస్యమయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను సమయాన్ని వృధా చేయనని…ప్రతి నిమిషం పని చేయడానికే చూస్తానని ప్రధాని అన్నారు.